నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని మరింత పదునుపెట్టాయి. దేశ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేయడంతో పాటు, ఈ అక్రమాలకు కారణమైన వారిని ప్రభుత్వమే వెనుకేసుకొస్తోందని విపక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో యువత భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వమే దారుణంగా దెబ్బతీసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున ఆయన మూడు కీలక డిమాండ్లను సభ ముందుకు తెచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశఆరు. జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాహుల్ కోరారు. దాంతో పాటు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.
https://x.com/RahulGandhi/status/2080145197745553599?s=20
అదేవిధంగా, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సైతం 'ఎక్స్' (X) వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వం తీవ్ర భయందోళనకు గురవుతోందని వ్యాఖ్యానించారు. బుధవారం రోజున కేంద్ర మంత్రి జేపీ నడ్డా నిర్వహించిన విలేకరుల సమావేశంపై స్పందిస్తూ.. రాహుల్ ప్రశ్నలకు సమాధానం దాటవేసేందుకే నడ్డా అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టారని ఆరోపించారు. ఆ సమావేశమంతా కేవలం గత ప్రభుత్వాల లోపాలను ఎత్తిచూపడానికే పరిమితమైంది తప్ప, ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న అసలు సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఈ పరిణామాలన్నీ కేంద్రంలో ఆవహించిన భయానికి స్పష్టమైన సంకేతాలని జైరాం రమేశ్ విశ్లేషించారు. మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విశ్వసనీయత కోల్పోయి, నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వ్యవస్థలను ప్రక్షాళన చేయకుండా, ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతోందని మండిపడ్డారు. మొత్తంగా ప్రతిపక్షాల వరుస దాడితో పార్లమెంట్ పరిసరాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
https://x.com/Jairam_Ramesh/status/2080112926263021613?s=20












