టాప్ న్యూస్

Hyderabad: ఏసీబీకి చిక్కిన "అధికార ముత్యం".. షాకిస్తున్న రెడ్కో డీజీఎం ఆస్తులు!..

రచన: Venu8 నిమిషాల పఠనం

తెలంగాణ టీజీ రెడ్కో డీజీఎం ముత్యం వెంకటరమణ వ్యవహారం ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. 2019లో రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆయన.. తాజాగా ఆదాయానికి మించిన రూ.28.14 కోట్ల ఆస్తులతో మరోసారి పట్టుబడ్డారు.

బయట పడిన ముత్యం బండారం!

భార్య పేరిట 4 కంపెనీలు.. 10 అపార్ట్‌మెంట్లు!

ఓ చేత్తో అధికారం.. మరో చేత్తో స్థిరాస్తి వ్యాపారం!

షాకిస్తున్న రెడ్కో డీజీఎం ఆస్తులు

తెలంగాణ టీజీ రెడ్కో డీజీఎం ముత్యం వెంకటరమణ వ్యవహారం ఇప్పుడు అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. 2019లో రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆయన.. తాజాగా ఆదాయానికి మించిన రూ.28.14 కోట్ల ఆస్తులతో మరోసారి పట్టుబడ్డారు. భార్య పేరిట నాలుగు నిర్మాణ సంస్థలు.. కూకట్‌పల్లిలో పది అపార్ట్‌మెంట్లు.. కోట్ల విలువైన ఫ్లాట్లు, భవనాలు, బంగారం, కార్లు.. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా!..

ప్రజలకు సేవ చేయాల్సిన అధికారం.. కొందరి చేతుల్లో అక్రమ సంపాదనకు ఆయుధంగా మారుతోందని ఈ మధ్య కాలంలో వరుసగా వెలుగులోకి వస్తున్న లంచావతారుల వ్యవహారాలు నిరూపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ.. టీజీ రెడ్కో డీజీఎం ముత్యం వెంకటరమణ వ్యవహారం కూడా ఇందుకు ఉదాహరణ.

ఓ చేత్తో ప్రభుత్వ ఉద్యోగం.. మరో చేత్తో స్థిరాస్తి వ్యాపారం.. అదీ భార్య పేరిట నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసి వేల కోట్లు సంపాదించినట్టు ఏసీబీ దాడుల్లో వెలుగులోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక తాజాగా వెంకటరమణ నివాసంతో పాటు ఆయన పనిచేస్తున్న రెడ్కో కార్యాలయం, సన్నిహితులు, బినామీలకు సంబంధించిన హైదరాబాద్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి.

దాదాపు 14 గంటలపాటు సాగిన ఈ తనిఖీల్లో ఆదాయానికి మించిన ఆస్తుల భారీ చిట్టా బయటపడింది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే మొత్తం రూ.28.14 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్ విలువ మాత్రం రూ.200 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో మూసాపేట ఆంజనేయనగర్‌లో సుమారు రూ.20 కోట్ల విలువైన ఫ్లాట్లు.. మాదాపూర్ గుట్టల బేగంపేటలో రూ.2.9 కోట్ల విలువైన ఐదంతస్తుల భవనం.. కూకట్‌పల్లి ఆంజనేయనగర్‌లో రూ.1.82 కోట్ల విలువైన మూడంతస్తుల భవనం.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో మరో నాలుగు ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.

అదేవిధంగా నాలుగు బ్యాంకు ఖాతాల్లో రూ.52.02 లక్షలు.. రూ.45 లక్షల విలువైన కియా, మహేంద్ర, బాలెనో కార్లు.. బ్యాంకు లాకర్‌లో 2 కిలోలకుపైగా బంగారం.. సుమారు రూ.30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖరీదైన గడియారాలు.. ఇంకా రూ.2.5 లక్షల విలువైన 19 విదేశీ మద్యం సీసాలు కూడా ఏసీబీ దాడుల్లో బయటపడ్డాయి. ఇక తన భార్య పేరిట ముత్యం కన్‌స్ట్రక్షన్స్, ముత్యం బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ముత్యం ఏఎన్‌ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, ప్రైడ్ హోమ్స్ పేర్లతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నట్టు గుర్తించిన అధికారులు.. కూకట్‌పల్లి ప్రాంతంలో పది అపార్ట్‌మెంట్లు నిర్మించినట్లు కనుగొన్నారు.

అయితే వెంకటరమణపై అవినీతి ఆరోపణలు ఇవాళ్టివి కావు. 2019లోనే రూ.25 వేల లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో రూ.26.52 లక్షల నగదు, రూ.22.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కోర్టులో ఉండగానే అక్రమాస్తుల వ్యవహారం వెలుగులోకి రావడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.

కాగా ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏసీబీ దాడుల్లో భారీగా అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు వరుసగా బయటపడుతున్నారు. రూ.300 కోట్ల వరకు అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొన్న డీఎస్పీ భీంరెడ్డి కేసు.. రూ.100 కోట్ల వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ వ్యవహారం.. రూ.40 కోట్ల ఆస్తుల కేసులో గజ్వేల్ తహసీల్దార్ ఉదంతాలు.. వ్యవస్థలోని లోపాలు చూపించడమే కాకుండా.. సమాధానం లేని ప్రశ్నలుగా మారుతున్నాయి.

మరోవైపు 2025లో తెలంగాణ ఏసీబీ 199 కేసులు నమోదు చేసి, భారీ అక్రమాస్తుల కేసుల్లో పలువురిపై చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇక ఏసీబీకి చిక్కిన ఆస్తులు.. అధికారికంగా గుర్తించిన విలువ మాత్రమే. రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువ మధ్య భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో.. అసలు సంపద ఎంత అన్నది దర్యాప్తు పూర్తయ్యే వరకు చెప్పలేం. అందుకే వెంకటరమణ కేసు కేవలం ఒక అధికారి అక్రమాస్తుల కేసు కాదు.

ప్రభుత్వ పదవిని ఉపయోగించి సంపద కూడబెట్టే వ్యవస్థపై ప్రశ్న.. లంచం తీసుకుంటూ పట్టుబడిన తర్వాత కూడా.. ఆస్తులపై నిఘా లేకపోతే ఏమవుతుందో చెప్పే ఉదాహరణ.. బినామీలు, కుటుంబ సభ్యుల పేర్లు, కంపెనీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. ఇవన్నీ అవినీతి సొమ్మును దాచే మార్గాలుగా మారుతున్నాయా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలాంటి కేసులు బయటపడుతున్న ప్రతిసారీ ప్రజల్లో ఒకే అనుమానం.

ఏసీబీకి చిక్కినవాళ్లు ఇంతమందేనా? లేక ఇంకా ఎన్నో ముత్యాలు అధికార వ్యవస్థలో దాగి ఉన్నాయా?.. ప్రభుత్వం నిజంగా అవినీతి నిర్మూలన కోరుకుంటే.. కేవలం లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిపైనే కాదు.. వారి ఆస్తుల మూలాలు, బినామీ వ్యవహారాలు, కుటుంబ సభ్యుల పేర్లలోని కంపెనీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై కూడా నిరంతర నిఘా అవసరం అనే విషయాన్ని వెంకటరమణ కేసును చూసైన గుర్తించాలి..

#telangana#Hyderabad#redco dgm#venkataramana#ACB#shocking Assets
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి