Spirituality

టీటీడీ కీలక అప్‌డేట్: అక్టోబర్ నెలకు శ్రీవారి దర్శన కోటా విడుదల!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమల గిరులకు వేంచేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారాన్ని వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్లు, ఆన్‌లైన్ గదుల కోటాను ఈ రోజు(గురువారం) విడుదల చేసింది.

శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమల గిరులకు వేంచేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారాన్ని వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్లు, ఆన్‌లైన్ గదుల కోటాను ఈ రోజు(గురువారం) విడుదల చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు భక్తులకు సూచించారు.

టికెట్ల విడుదల షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇక భక్తులు ఎంతగానో ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనానికి 20గంటలు

మరొకవైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ అత్యంత భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోవడంతో, క్యూలైన్లు వెలుపలికి విస్తరించాయి. సర్వదర్శనం టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 20 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీరు, పాలు, అన్నప్రసాదాలను నిరంతరం పంపిణీ చేస్తున్నారు.

తాజా గణాంకాల ప్రకారం నిన్న(బుధవారం) ఒక్కరోజే మొత్తం 77,874 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 35,302 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లుగా నమోదైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు భద్రతా, నిర్వహణ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

#TTD News#Tirumala Darshan#Tirupati Tickets#Srivari Darshan#TTD October Quota#Special Entry Darshan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి