నగరంలో మళ్లీ రౌడీ దర్బార్
చాపకింద నీరులా రౌడీషీటర్ల దందాలు
పోలీసుల చర్యలున్నా ఆగని దాష్టీకాలు
పాత కక్షలు.. గ్యాంగ్‌వార్‌లు.. సెటిల్‌మెంట్లు
పీడీ యాక్టులు, బైండోవర్లు ఉన్నా తగ్గని ఆగడాలు?
హైదరాబాద్‌లో చాపకింద నీరులా రౌడీషీటర్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయా..? పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నగరంలో రౌడీ దర్బార్ ఎందుకు ఆగడం లేదు..? ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు పోలీసులు రౌడీషీటర్లపై పీడీ యాక్టులు, బైండోవర్లు, ప్రత్యేక నిఘా వంటి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. మరోవైపు.. పాత నేరస్థులు మాత్రం తరచూ హత్యలు, దాడులు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లతో తమ ఉనికిని చాటుకుంటూ ఉన్నారు.
కొంతమంది రౌడీషీటర్లు గ్యాంగ్‌లుగా ఏర్పడి భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షల పేరుతో సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య పాత కక్షలు, గ్యాంగ్ ఆధిపత్య పోరుపై మరోసారి ఆందోళన కలిగించింది. ప్రత్యర్థి అర్ఫాజ్ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ఒక్కసారిగా జరిగేవి కావు. కొన్నిసార్లు చిన్న గొడవలు.. ఆ తర్వాత వ్యక్తిగత కక్షలు.. చివరకు గ్యాంగ్‌వార్‌లు, హత్యల వరకు వెళ్తున్నాయి. ఒకప్పుడు గల్లీ గొడవలుగా మొదలైన వివాదాలు.. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు, బెదిరింపు కాల్స్, వాట్సాప్ గ్రూపులు, ప్రత్యక్ష దాడులుగా మారుతున్నాయి. యువతను తమ వెంట తిప్పుకుంటూ కొందరు నేరస్థులు తమ ప్రభావాన్ని పెంచుకుంటున్నారనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే అందరికీ కనిపించకుండా కొందరు రౌడీషీటర్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పీడీ యాక్టు, బైండోవర్ల భయంతో కొందరు తమ ప్రాంతాలను విడిచి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో మకాం వేస్తున్నారు. మారుపేర్లతో అక్కడి నుంచే సెటిల్‌మెంట్లు, వసూళ్లు, భూదందాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు గాలించినా.. తరచూ ప్రాంతాలు మార్చుకుంటూ తప్పించుకుంటున్నారని తెలుస్తోంది.
పాతబస్తీకి చెందిన రౌడీషీటర్ ఆయుబ్‌ఖాన్ ఉదంతం కూడా ఇలాంటి పరిస్థితులకు ఉదాహరణగా ప్రస్తావించబడుతోంది. ప్రధాన నేరస్థులు కొంతకాలం కనిపించకుండా ఉన్నా.. వారి అనుచరులు మాత్రం భాయ్ మనుషులం అంటూ బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పాతబస్తీతో పాటు జల్‌పల్లి, కాటేదాన్, బాలాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో రౌడీషీటర్ల వ్యవహారాలు తరచూ చర్చకు వస్తున్నాయి.
ఫుట్‌పాత్ ఆక్రమణలు, అక్రమ వసూళ్లు, భూ వివాదాల్లో జోక్యం వంటి వ్యవహారాల ద్వారా కొందరు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో జవహర్‌నగర్‌లో రియల్టర్ వెంకటరత్నం హత్య సంచలనం సృష్టించింది. అంటే.. పాత కక్షలు పూర్తిగా ముగిశాయని భావించినా.. ఏళ్ల తర్వాత అవే వివాదాలు మళ్లీ హత్యలకు దారితీస్తున్నాయని అర్థం అవుతుంది.
ఇందుకు కారణం రౌడీషీటర్లు, పాత నేరస్థులపై నిరంతర నిఘా లేకపోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీగ్యాంగ్‌ల కదలికలను ఇన్‌స్పెక్టర్లు, సెక్టార్ ఎస్సైలు నిరంతరం గమనించాలి. వారు ఎక్కడ ఉంటున్నారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఏం చేస్తున్నారు..? ఎలాంటి వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు..? అనే అంశాలపై నిరంతర నిఘా అవసరం.
కానీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు, ప్రత్యేక సందర్భాలు లేదా ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చినప్పుడే తనిఖీలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో కొందరు రౌడీషీటర్లు మళ్లీ తమ పాత కార్యకలాపాలను మొదలుపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. స్థానిక రాజకీయ, సామాజిక పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమాచారం.
కొందరు స్థానిక గల్లీ లీడర్లతో సన్నిహితంగా ఉంటూ పోలీసుల ఒత్తిడి వచ్చినప్పుడు వారి సహకారం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు తమపై ఉన్న నేరచరిత్ర తొలగితే.. ఇకపై ప్రజాజీవితంలోకి వస్తామని పోలీసులకు చెబుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కానీ నేరచరిత్రను మార్చుకోవడం మాటలతో సాధ్యం కాదు. ప్రజల్లో భయాన్ని సృష్టించిన వ్యక్తులు నిజంగా మారారా..? లేక మళ్లీ అదే నేర ప్రపంచంలోకి వెళ్తున్నారా..? అన్నది నిరంతరం పోలీసులు పరిశీలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఇప్పటి సామాజిక పరిస్థితుల్లో ఒక చిన్న గొడవ కూడా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో పెద్ద వివాదంగా మారుతోంది. వ్యక్తిగత కక్షలు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణలకు దారితీస్తున్నాయి. భూ వివాదాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, ఆన్‌లైన్ ద్వారా యువతను ప్రభావితం చేయడం వంటి అంశాలు నేరస్థులకు కొత్త మార్గాలుగా మారుతున్నాయి. అందుకే రౌడీషీటర్లపై కేవలం కేసులు నమోదు చేయడం, బైండోవర్ చేయడం మాత్రమే సరిపోదు. వారి ఆర్థిక కార్యకలాపాలు, అనుచరుల కదలికలు, ఆయుధాల వినియోగం, భూసెటిల్‌మెంట్లు, గ్యాంగ్ లతో సంబంధాలపై సమగ్ర నిఘా అవసరం.
ఇక రౌడీషీటర్ల హవాకు అడ్డుకట్ట వేయాలంటే.. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కాదు.. నేరం జరగకముందే పసిగట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. చాపకింద నీరులా సాగుతున్న ఈ రౌడీల దందాలు.. ఏదో ఒకరోజు మరో పెద్ద విషాదానికి దారితీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి..












