Spirituality

Spirituality: సంతోషకరమైన జీవితం అంటే ఏమిటి..? లోకంలో నిజమైన ధనవంతుడు ఎవరు..?

రచన: Venu8 నిమిషాల పఠనం

డబ్బు ఉండాలి, ఆస్తులు ఉండాలి, పేరు, ప్రతిష్ఠ ఉండాలి, ఇవన్నీ మనిషి జీవితంలో అవసరమే! కానీ.. కోట్లు సంపాదించినా సంతోషం లేని వాళ్లను చూశాం. అపారమైన ఆస్తులు ఉన్నా ప్రశాంతత లేని వాళ్లను చూశాం. ప్రపంచం మొత్తం గౌరవించినా.. తమ కుటుంబంలోనే ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లను చూశాం.

డబ్బు ఉండాలి, ఆస్తులు ఉండాలి, పేరు, ప్రతిష్ఠ ఉండాలి, ఇవన్నీ మనిషి జీవితంలో అవసరమే! కానీ.. కోట్లు సంపాదించినా సంతోషం లేని వాళ్లను చూశాం. అపారమైన ఆస్తులు ఉన్నా ప్రశాంతత లేని వాళ్లను చూశాం. ప్రపంచం మొత్తం గౌరవించినా.. తమ కుటుంబంలోనే ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లను చూశాం. అయితే నిజమైన సంతోషకరమైన జీవితం అంటే ఏమిటి..? అది ఎలా వస్తుంది..? అనే ప్రశ్నలు ప్రతి వారి మదిలో మెదులుతాయి..

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే... కొన్ని జీవిత సత్యాలను మనం గుర్తు చేసుకోవాలి. మొదటిది.. తండ్రి జీవితం కంటే కొడుకు జీవితం మెరుగ్గా ఉంటే...ఆ కొడుకు నిజంగా అదృష్టవంతుడు!.. ఎందుకంటే.. చాలామంది కోట్లు సంపాదిస్తారు. కానీ కాలం మారితే.. అదే సంపద పోయి దివాళా తీసే పరిస్థితి వస్తుంది. అందుకే సంపాదన కంటే...

జీవిత విలువలు ముఖ్యం. మన తండ్రి కంటే మన జీవితం మెరుగ్గా ఉంటే.. మన పిల్లల జీవితం మనకంటే మెరుగ్గా ఉంటే.. అదే నిజమైన అభివృద్ధి!

ఇక సత్య నాదెళ్ల గారి జీవితాన్ని చూడండి.. మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థకు నాయకత్వం వహించిన సత్య నాదెళ్ల గారు అపారమైన సంపదను సంపాదించారు. కానీ.. ఆయన కుమారుడు అంగవైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు.. దాదాపు 25 సంవత్సరాల జీవితం తర్వాత ఆయన మరణంచి ఆ తండ్రికి, వారి కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళాడు..

ఈ సంఘటన ప్రతి వారికి ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది.. డబ్బుతో చాలా వస్తువులు కొనగలం.. కానీ ఆరోగ్యాన్ని, జీవితాన్ని, ప్రాణాన్ని కొనలేం!.. ఇక సుబ్బరామిరెడ్డి గారి జీవితాన్ని చూడండి.. అపారమైన సంపద ఉన్నప్పటికీ.. ఆయన కుమారుడు మానసిక వైకల్యంతో బాధపడ్డాడు. పెళ్లి కూడా సుఖంగా సాగలేదు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఒక్కటే.. సంపదతో అన్నీ సాధ్యం కాదని.. ఆరోగ్యం, మంచి బుద్ధి, ప్రశాంతమైన కుటుంబ జీవితం... ఇవే అసలైన సంపదని..

ఇక మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి జీవితంలోనూ ఇదే సత్యం కనిపిస్తుంది. వందల కోట్ల సంపద.. అపారమైన కీర్తి ప్రతిష్టలు.. ప్రజల ప్రేమ.. అన్నీ ఉన్నా కూడా మొదటి భార్య మరణంతో కుటుంబంలో ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. తర్వాతి జీవితంలో వచ్చిన కుటుంబ కలహాలు మరింత మనస్తాపానికి దారి తీశాయి. చివరికి.. ప్రపంచం నుండి శాశ్వతంగా దూరం చేశాయి..

బయట ప్రపంచం గెలిచిన మనిషి. తన మనసుతో మాత్రం గెలవలేని పరిస్థితి ఏర్పడింది. ఇది మనకు చెప్పే పాఠం.. అందుకే బయటి విజయం కంటే.. మనసులోని ప్రశాంతతే గొప్పదని అంటారు. ఇక రేమాండ్స్ అధినేత విశ్వపతి సింఘానియా గారి జీవితాన్ని చూడండి. తన జీవితాన్ని ధారపోసి.. అపారమైన ఆస్తులు సంపాదించారు. కానీ, కన్నా కొడుకే ఆయనను ఇంటి నుంచి బయటకు పంపిన పరిస్థితి వచ్చింది..

డబ్బు ఉంటే ఖరీదైన వస్తువుల్ని కొనగలం.. కానీ కుటుంబ బంధాలను కొనలేం అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది.. బంధాలు నిలబడకపోతే.. ఎంత పెద్ద భవనం ఉన్నా.. మనసులో మాత్రం ఒంటరితనమే మిగులుతుంది. అందుకే డబ్బు కంటే ధర్మం గొప్పదని మన పురాణాలు చెబుతాయి. మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు. ఎలా సంపాదించామన్నదే ముఖ్యం.

ధర్మ మార్గంలో జీవిస్తూ.. పిల్లలకు మంచి సంస్కారం నేర్పిస్తూ.. వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలకు ఉపయోగిస్తూ ఉంటే.. అప్పుడే ఆ సంపదకు నిజమైన విలువ వస్తుంది. ఎందుకంటే?.. డబ్బు మన దగ్గర ఉన్నంత కాలం మనది. కానీ మనం చేసే మంచి మాత్రమే... మన తర్వాత కూడా మనతో ఉంటుంది!..

ఇక డబ్బు-అహంకారం విషయానికి వస్తే.. డబ్బు అవసరం. కానీ డబ్బు ఉన్నదన్న అహంకారం అవసరం లేదు. ఎందుకంటే?.. డబ్బు పెరిగే కొద్దీ అహంకారం పెరిగితే!.. సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. అహంకారం వచ్చిన చోట.. బంధాలు దూరమవుతాయి. స్నేహాలు దూరమవుతాయి. మనశ్శాంతి దూరమవుతుంది. అందుకే డబ్బును ఉపయోగించాలి.. కానీ డబ్బు మనల్ని ఉపయోగించకూడదు!..

ఇక మనిషి బాధలకు ప్రధాన కారణం కోరికలు అని బుద్ధుడు అంటారు.. ఆయన చెప్పినట్టు.. కోరికలు పెరుగుతున్న కొద్దీ.. మనసులో అశాంతి పెరుగుతుంది. ఒక కోరిక నెరవేరగానే... మరో కోరిక పుడుతుంది. అది నెరవేరగానే ఇంకో కోరిక మొదలవుతుంది. ఇలా మనిషి తన జీవితమంతా ఏదో ఒకటి కావాలని పరుగెత్తుతూనే ఉంటాడు. ఈ ప్రయాణంలో తనని తాను మరచిపోతాడు.

మనిషికి తృప్తి లేకపోతే.. కోట్లు ఉన్నా పేదవాడిగానే పరిగణిస్తారు. మంచి భోజనం, మంచి నిద్ర, తలదాచుకోవడానికి ఒక ఇల్లు, గౌరవప్రదమైన జీవితం, ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు.. ఇవన్నీ ఉన్న వాడు ఎప్పటికీ ధనవంతుడే.. వీటికి తోడుగా ధర్మం ఉంటే.. దానగుణం ఉంటే.. మానవత్వం ఉంటే.. మన జీవితం నిజంగా పరిపూర్ణమవుతుంది.

ఎందుకంటే ఎవరికీ ఎప్పుడూ సుఖాలే ఉండవు.. కష్టాలు కూడా తప్పవు.. కానీ.. కష్టాల్లోనూ ధైర్యంగా ఉండటం.. ఉన్నదాంట్లో తృప్తిగా జీవించడం.. ఇతరులకు సహాయం చేయడం.. సమాజంలో గౌరవంగా జీవించడం.. ఇదే నిజమైన అదృష్టం!.. ఇక శేషప్ప కవి చెప్పిన మాటలు.. తల్లి గర్భం నుంచి ధనం తీసుకెళ్లలేం.. లవణం అన్నం మింగినట్టు బంగారం మింగలేం.. ఇదే నిజమైన జీవన సత్యం!..

చివరికి మనిషి వెంట వెళ్లేది.. కోట్లు కాదు.. బంగారం కాదు.. ఆస్తులు కాదు.. మనతో వెళ్లేది మనం చేసిన మంచే!.. అందుకే.. మనసుకు ప్రశాంతత.. జీవితంలో తృప్తి.. చేతల్లో ధర్మం.. మాటల్లో సత్యం.. హృదయంలో మానవత్వం.. ఇవే.. సంతోషకరమైన జీవితానికి అసలైన అర్థం! అని మన హైందవ ధర్మం చెప్పే సారం అని వేదోత్తములు అంటారు..

#India#spirituality#happy life#truly wealthy person#world
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి