Tollywood: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురైనట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. NBK111 షూటింగ్ సెట్‌లో అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కొత్త సినిమా చిత్రీకరణ కోసం కాకినాడ పోర్టులో లొకేషన్ ప్లాన్ చేశారు. అయితే, ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. ఈ క్రమంలో ఆయన మోకాలికి బలమైన దెబ్బ తగిలింది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు, ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
అక్కడ స్కానింగ్ నిర్వహించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం బాలకృష్ణను వెంటనే హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నిపుణులైన వైద్య బృందం పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి, మోకాలికి శస్త్రచికిత్స చేయడమే సరైన పరిష్కారమని స్పష్టం చేశారు. దీంతో ఈరోజే ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నారు.
ఈ శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత బాలయ్య పూర్తిగా కోలుకోవడానికి కనీసం నాలుగు నుండి ఐదు వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ కాలంలో ఆయన ఎలాంటి భారాన్ని మోకాలైపై మోపకూడదని, పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాలని గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన షూటింగ్‌లతో పాటు, తన రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు కూడా కొంతకాలం విరామం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ విషయం బయటకు రాగానే బాలయ్య త్వరగా కోలుకోవాలని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.












