National

నీట్‌పై కొత్త ట్విస్ట్.. మెడికల్ అడ్మిషన్లు రాష్ట్రాల చేతుల్లోకి సాధ్య‌మేనా?

రచన: Kashi14 నిమిషాల పఠనం

నీట్ ప‌రీక్ష పేప‌ర్ల లీక్ వ్య‌వ‌హారం త‌ర్వాత మ‌రోసారి విద్యారంగంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి జాబితాలో ఉన్న విద్యారంగాన్ని తిరిగి రాష్ట్రాల‌కే అప్ప‌గించాల‌ని త‌మిళ‌నాడు లాంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రాల హక్కుల కోసం విద్యా రంగాన్ని రాష్ట్ర జాబితాలోకి మార్చడం న్యాయబద్ధంగా సాధ్యమే అయినా, దానికి కావాల్సిన రాజకీయ ఏకాభిప్రాయం, పార్లమెంట్‌లో భారీ మెజారిటీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చాలా కష్టంతో కూడుకున్న పని.

నీట్ ప‌రీక్ష‌పై స‌రికొత్త ట్విస్ట్

రాష్ట్రాల‌కే హ‌క్కులివ్వాలంటున్న పార్టీలు

నీట్.. పై కేంద్రం వెన‌క్కి త‌గ్గుతుందా..?

విద్య‌ను ఉమ్మ‌డి జాబితాలో నుంచి క‌దిలిస్తారా..

దేశ రాజ‌కీయాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఉద్య‌మం వెనుక ఉన్న ఏకైక కార‌ణం.. నీట్ ప‌రీక్ష ఇష్యూ. ఆ ఎగ్జామ్ పేప‌ర్ లీకుల‌కు కేంద్రం బాధ్య‌త వ‌హించాల‌నే డిమాండ్. సీజేపీ సోష‌ల్ మీడియా వేదిక నుంచి జ‌నాల్లోకి వ‌చ్చే ముందు ఎత్తుకున్న నినాదం.. కేంద్ర విద్యా శాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా. ఈ క్ర‌మంలో ఇప్పుడో స‌రికొత్త చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. నీట్ పరీక్ష నిర్వ‌హ‌ణ నుంచి కేంద్రం వెన‌క్కి త‌గ్గాల‌ని, రాష్ట్రాల‌కే ఆ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని కొన్ని ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కొత్త డిమాండ్ కాన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మాత్రం మ‌రోసారి ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. అస‌లేంటీ నీట్ ప‌రీక్ష వివాదం. ఈ ప‌రీక్ష‌ను కేంద్ర‌మే ఎందుకు నిర్వ‌హిస్తోంది..? నీట్ పరీక్షా విధానం, దాని ద్వారా వ‌స్తున్న వివాదాల‌పై స్వేచ్ఛ ప్ర‌త్యేక క‌థ‌నం.

నీట్ ప‌రీక్ష వివాద‌మేంటి..?

MBBS, BDS ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET - National Eligibility cum Entrance Test) పరీక్ష మొదటిసారిగా 2013 మే 5న ప్రారంభమైంది. సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో 2013లో మొదటిసారి నీట్ పరీక్ష నిర్వహించారు. అయితే, కొన్ని రాష్ట్రాలు, ప్రైవేట్ కళాశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షను కోర్టు రద్దు చేసింది. దీనివల్ల 2014, 2015 సంవత్సరాల్లో పాత పద్ధతిలోనే AIPMT, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు జరిగాయి.

సుప్రీంకోర్టు తన పాత తీర్పును సమీక్షించి, 2016 నుండి నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2019 త‌ర్వాత ఈ పరీక్షను నిర్వహించే బాధ్యతను సీబీఎస్‌ఈ నుండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ..NTA కి అప్పగించారు. ఎయిమ్స్, జిప్‌మర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ప్రత్యేక పరీక్షలను కూడా రద్దు చేసి, దేశంలోని అన్ని వైద్య సీట్లను నీట్ పరిధిలోకి తీసుకువచ్చారు.

వివాదానికి కార‌ణాలేంటి..?

నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా తీవ్రమైన వివాదాలు, నిరసనలు రావడానికి ప్రధాన కారణాలు పేపర్ లీకేజీలు, మార్కుల కేటాయింపులో అవకతవకలు. అంతే కాకుండా ప్రాంతీయ అసమానతలు. వైద్య సీట్ల కోసం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పరీక్ష వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

2021, 2024 సంవత్సరాల్లో కూడా పేపర్ లీక్ ఆరోపణలు రావడం, సుప్రీంకోర్టు వరకు కేసులు వెళ్లడం వల్ల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విశ్వసనీయతపై విద్యార్థులు నమ్మకం కోల్పోయారు. ఇక ఈ ఏడాది ఈ ప‌రీక్ష‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వచ్చాయి. మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్ష ప్రశ్నపత్రం ముందే లీక్ అయిందనే ఆరోపణలతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. జూన్ 21న తిరిగి నిర్వహించాల్సి వచ్చింది.

క‌ల‌వ‌ర‌పెడుతున్న విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు

నీట్ పేపర్ లీక్ వివాదం కారణంగా రద్దయిన తర్వాత, మళ్లీ పరీక్ష రాసేందుకు ఇచ్చిన 37 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కనీసం 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి ఈ మరణాలు నమోదయ్యాయి. 2021 నుండి ఇప్ప‌టివ‌ర‌కు 93 మందికి పైగా నీట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్టు కొన్ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. నీట్ పరీక్షా విధానం తెచ్చిన విపరీతమైన పోటీ, మానసిక ఒత్తిడి, ఇటీవలి పేపర్ లీకేజీల వల్ల దేశవ్యాప్తంగా ఈ ఆత్మ‌హ‌త్య‌లు సంభ‌వించిన‌ట్టు వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ప్రాంతీయ, సామాజిక అసమానతలు

నీట్ పరీక్ష కేవలం కార్పొరేట్ కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టగలిగే ధనిక, పట్టణ విద్యార్థులకే లాభం చేకూరుస్తోందనే విమర్శ ఉంది. రాష్ట్ర సిలబస్‌లో చదివే ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సీబీఎస్‌ఈ ఆధారిత నీట్ సిలబస్‌ను అందుకోలేక వెనుకబడిపోతున్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు నీట్ పరీక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నందున, రాష్ట్ర వైద్య కళాశాలల్లో ప్రవేశాల హక్కు రాష్ట్రాలకే ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్ మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించాలని త‌మిళ‌నాడు నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

గ‌తంలో మెడిక‌ల్ సీట్లు ఎలా భ‌ర్తీ చేసేవారు..?

2016 కంటే ముందు దేశంలో వైద్య విద్యా సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి భిన్నంగా ఉండేది. అప్పట్లో ఒకే దేశవ్యాప్త పరీక్ష కాకుండా, వివిధ స్థాయిల్లో బహుళ ప్రవేశ పరీక్షల ద్వారా సీట్లను భర్తీ చేసేవారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ పరీక్ష ద్వారా మెడికల్ సీట్లను భర్తీ చేసేవారు. తమిళనాడులో ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం 12వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లు ఇచ్చేవారు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 85% సీట్లను ఆయా రాష్ట్రాల విద్యార్థులకే కేటాయించేవారు. దీన్ని లోక‌ల్ కోటాగా ప‌రిగ‌ణించేవారు.

సీబీఎస్‌ఈ ప్రతి ఏటా 'ఆల్ ఇండియా ప్రీ-మెడికల్ టెస్ట్' (AIPMT) నిర్వహించేది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్య కళాశాలల నుండి 15% సీట్లను ఈ పూల్‌కు కేటాయించేవారు. ఏ రాష్ట్ర విద్యార్థి అయినా మెరిట్ ఆధారంగా దేశంలో ఎక్కడైనా ఈ 15% సీట్లలో చేరడానికి ఈ పరీక్ష ఉపయోగపడేది. AIIMS, జిప్‌మర్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్.. AFMC వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలు తమ సీట్ల భర్తీ కోసం సొంతంగా విడివిడిగా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను నిర్వహించుకునేవి. 2016 నుంచి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ మ‌ధ్యకాలంలో త‌ర‌చూ పేప‌ర్ లీకులు కావ‌డంతో.. దీనిపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌దేళ్ల కాలంలో దాదాపు 152కు పైగా వివిధ కాంపిటీటివ్ ఎగ్జామ్ పేప‌ర్లు లీక‌య్యాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు విద్యను రాష్ట్ర ప‌రిధిలోకే తేవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

విద్యా రంగాన్ని రాష్ట్ర జాబితాలోకి మార్చ‌డం సాధ్య‌మేనా..?

నీట్ ప‌రీక్ష పేప‌ర్ల లీక్ వ్య‌వ‌హారం త‌ర్వాత మ‌రోసారి విద్యారంగంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి జాబితాలో ఉన్న విద్యారంగాన్ని తిరిగి రాష్ట్రాల‌కే అప్ప‌గించాల‌ని త‌మిళ‌నాడు లాంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. వాస్త‌వానికి మ‌న రాజ్యాంగం అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విద్య పూర్తిగా రాష్ట్ర జాబితాలోనే ఉండేది. 1976లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు. అప్పటి నుండి విద్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికీ చట్టాలు చేసే అధికారం లభించింది.

విద్యను తిరిగి రాష్ట్ర జాబితాలోకి తీసుకురావాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ప్రత్యేక సవరణ చేయాలి. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ హాజరైన సభ్యులలో కనీసం 2/3 వంతు మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందాలి. కేవలం పార్లమెంట్ ఆమోదిస్తే సరిపోదు. దేశంలోని మొత్తం రాష్ట్రాలలో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ సవరణను సాధారణ మెజారిటీతో తీర్మానించి ఆమోదించాల్సి ఉంటుంది. జాతీయ విద్యా విధానం, నీట్ వంటి ఏకీకృత పరీక్షల ద్వారా విద్యా వ్యవస్థపై పట్టు సాధించాలని కేంద్రం భావిస్తుంది. కాబట్టి, ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వమైనా తన అధికారాలను రాష్ట్రాలకు వదులుకోవడానికి సిద్ధపడటం కష్టం. బీజేపీ లాంటి పార్టీలు అధికారంలో ఉన్న‌ప్పుడు ఇంకా క‌ష్టం.

బిజెపియేతర లేదా ప్రాంతీయ పార్టీలు పాలించే రాష్ట్రాలు దీనిని బలంగా కోరుకుంటున్నప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పాలించే రాష్ట్రాలు దీనికి మద్దతు ఇవ్వకపోవచ్చు. మొత్తం విద్యా రంగాన్ని రాష్ట్ర జాబితాలోకి మార్చడం కష్టం కాబట్టి, తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్ష నుండి మినహాయింపు కోరుతూ ప్రత్యేక బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2) ప్రకారం ఉమ్మడి జాబితాలోని అంశంపై కేంద్ర చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రం చట్టం చేసి, దానిని రాష్ట్రపతి ఆమోదం పొందితే ఆ రాష్ట్రంలో రాష్ట్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. అయితే, దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం స‌హ‌కారం త‌ప్ప‌నిస‌రి.

రాష్ట్రాల హక్కుల కోసం విద్యా రంగాన్ని రాష్ట్ర జాబితాలోకి మార్చడం న్యాయబద్ధంగా సాధ్యమే అయినా, దానికి కావాల్సిన రాజకీయ ఏకాభిప్రాయం, పార్లమెంట్‌లో భారీ మెజారిటీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే ఇప్ప‌ట్లో ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. కానీ.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఉద్య‌మం మ‌రింత ఉధృత‌మైతే.. రానున్న రోజుల్లో విద్యారంగంలో స‌మూల మార్పులు జ‌రిగే అవ‌కాశ‌ముంది.

#NEET Paper Leak#NEET Controversy#Medical Entrance Exam#Indian Education#State Rights#Medical Admissions
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి