National

ఐ డోంట్ కేర్ అంటూ.. రాహుల్ టాప్‌గేర్

రచన: Kashi6 నిమిషాల పఠనం

కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ స్పీడ్ పెంచారు. అలాంటి ఇలాంటి స్పీడ్ కాదు.. కాంగ్రెస్‌ను టాప్ గేర్‌లోకి తీసుకెళ్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు అధికారం దూర‌మై దాదాపు 12 ఏళ్ల‌వుతోంది. ఈ పుష్క‌రకాలంలో కాంగ్రెస్ ఏ నాడూ ఇంత అగ్రెసివ్‌గా ముందుకెళ్లింది లేదు.

కాంగ్రెస్‌లో స‌రికొత్త జోష్

కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి అండ‌గా పోరాటం

స్పీడ్ పెంచిన రాహుల్‌గాంధీ

విద్యార్థుల‌కు న్యాయం జ‌ర‌గాలి. ప‌రీక్ష‌ల విధానంలో మార్పులు రావాలి. ప్ర‌జ‌ల కోసం ఎన్ని దెబ్బ‌లు తిన‌డానికైనా సిద్ధం... ఐ డోంట్ కేర్. ఇవీ కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌గాంధీ మాట‌లు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తుగా రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ స్పీడ్ పెంచారు. అలాంటి ఇలాంటి స్పీడ్ కాదు.. కాంగ్రెస్‌ను టాప్ గేర్‌లోకి తీసుకెళ్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు అధికారం దూర‌మై దాదాపు 12 ఏళ్ల‌వుతోంది. ఈ పుష్క‌రకాలంలో కాంగ్రెస్ ఏ నాడూ ఇంత అగ్రెసివ్‌గా ముందుకెళ్లింది లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నా.. రాహుల్‌గాంధీ రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న‌లు తెలిపిన సంఘ‌ట‌న‌లు చాలా అరుదు.

ప్ర‌ధాని ఇంటి ముందే సై అంటే సై

మంగ‌ళ‌వారం రోజున ఢిల్లీలో మొత్తం కాంగ్రెస్ షో నే న‌డిచింది. ఎంపీ ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే, ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి అనూహ్యంగా ప్ర‌ధాని ఇంటి ముట్ట‌డికి బ‌య‌ల్దేరారు రాహుల్. హై సెక్యూరిటీ జోన్‌లో మూడున్న‌ర గంట‌ల పాటు హ‌ల్‌చ‌ల్ చేశారు. ఏకంగా ప్ర‌ధాని రాజీనామాకే డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి జితేంద‌ర్‌సింగ్ వ‌చ్చి మాట్లాడినా త‌గ్గేదే లేద‌ని తేల్చిచెప్పారు. కేంద్రం ముందు ఐదు డిమాండ్ల‌ను పెట్టారు.

రాహుల్‌గాంధీ స‌హా కాంగ్రెస్ నాయ‌కుల‌ను అరెస్ట్ చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు పోలీసులు. ఈ క్ర‌మంలో రాహుల్‌కు గాయ‌మైంది. అయినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్లారు. ఆ త‌ర్వాత పోలీస్ స్టేష‌న్ల వ‌ద్ద కాంగ్రెస్ నాయ‌కులు చాలా హ‌డావుడి చేశారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న తెలిపాయి. ప్ర‌ధాని నివాసం ముందు రాహుల్ బైఠాయించ‌డంతో.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు యాక్టివేట్ అయ్యాయి.

సుధీర్ఘ‌మైన ప్రెస్‌మీట్‌లో దూకుడు

బుధ‌వారం దాదాపు గంట‌పాటు మీడియాతో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. కేంద్రాన్ని డైర‌క్ట్‌గా టార్గెట్ చేశారు. గత 10 ఏళ్లలో 152 పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ఆరోపించారు. విద్యార్థుల విషయంలో ఏం జరుగుతోందని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు రాహుల్. పారదర్శకమైన విద్యా వ్యవస్థ కావాలని యువత కోరుతోందని చెప్పారు. కానీ.. ఈ ప్రభుత్వం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై లాఠీఛార్జ్‌ చేయించిందని ఫైర్ అయ్యారు. పేప‌ర్ లీకేజీల వల్ల దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థులు న‌ష్ట‌పోయార‌ని చెప్పారు.

దేశ యువతకు ఉద్యోగాలు లేవు. విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద ప్రధాన్‌ పూర్తిగా విఫలమయ్యారని, లీకేజీకి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని యువత డిమాండ్‌ చేస్తోంద‌ని రాహుల్ చెప్పారు.

ఎన్ని దెబ్బ‌లైనా ఓకే.. ఐ డోంట్ కేర్

విద్యార్థుల ఆందోళనను రాజకీయాలకు వాడుకోవట్లేదని రాహుల్ స్ప‌ష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజల గళం వినిపించడం త‌న‌ బాధ్యత అని చెప్పారు. దీనిపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు కేంద్రం అవకాశం ఇవ్వట్లేదు కాబ‌ట్టే.. వీధుల్లోకి వ‌చ్చామ‌న్నారు. విద్యార్థులు కూడా అందుకే పోరాటం చేస్తున్నార‌ని రాహుల్ చెప్పారు. నిరసనల్లో త‌న‌ పట్ల జరిగిన దానికి బాధపడటం లేదని, విద్యార్థులకు జరుగుతోన్న నష్టం విషయంలోనే బాధగా ఉందని అన్నారు. ప్రజల కోసం ఎన్ని దెబ్బలు తినేందుకైనా సిద్ధం అని రాహ‌ల్ తెలిపారు.

#Rahul Gandhi#Congress Protest#NEET Controversy#Exam Paper Leak#Student Protest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి