మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఓ అరుదైన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిత్యం భక్తుల పూజలతో కళకళలాడే ఓ పురాతన శివాలయంలో.. శివలింగాన్ని చుట్టుకొని నాగుపాము కనిపించడంతో అక్కడి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
జులై 21 మంగళవారం, ఉదయం.. గంగా సాగర్ స్కూల్ సమీపంలో ఉన్న శివాలయానికి నిత్య పూజల కోసం వెళ్లిన భక్తులకు ఈ అరుదైన దృశ్యం కనిపించింది. సాక్షాత్తూ పరమశివుడి మెడలో ఉండే నాగేంద్రుడే ఆలయంలోకి వచ్చాడా అన్నట్లుగా.. ఓ పాము శివలింగాన్ని చుట్టుకొని కనిపించింది.
మొదట ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆ తర్వాత ఎలాంటి తొందరపాటుకు గురికాకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా గర్భగుడిలోకి ఎవరూ వెళ్లకుండా అప్రమత్తమయ్యారు. పామును బెదిరించడం గానీ.. దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నం గానీ చేయలేదు. దూరంగా నిలబడి బయట నుంచే భక్తులు పూజలు చేశారు.
దాదాపు రెండు గంటల పాటు ఆ పాము శివలింగం చుట్టూనే ఉండటంతో.. ఈ విషయం క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఆలయం వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాలను చిత్రీకరించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ కావడంతో ఘటన వైరల్‌గా మారింది.
హిందూ సంప్రదాయాల్లో నాగుపాముకు శివుడితో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంబంధం ఉందని భక్తులు విశ్వసిస్తారు. పరమశివుడి మెడలో నాగేంద్రుడు అలంకారంగా ఉండటంతో.. శివలింగాన్ని చుట్టుకొని పాము కనిపించడాన్ని కొందరు భక్తులు శుభసూచకంగా భావించారు.
అయితే సుమారు రెండు గంటల తర్వాత ఆ పాము ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా.. తనంతట తానే ఆలయం నుంచి బయటకు వెళ్లిపోయింది. పాము వెళ్లిపోయిన తర్వాత భక్తులు ఆలయంలోకి వెళ్లి శివుడికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంతంగా ముగిసిన ఈ సంఘటన.. ప్రస్తుతం ఛతర్‌పూర్‌లో చర్చనీయాంశంగా మారింది. శివలింగాన్ని చుట్టుకొని కనిపించిన నాగుపాము దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భక్తులు మాత్రం దీనిని శివుడి అనుగ్రహానికి సంబంధించిన అరుదైన అనుభూతిగా భావిస్తున్నారు.












