నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్ లీక్ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తుండగా.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఒకవైపు పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతుండగా.. మరోవైపు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు పేపర్ లీక్ వెనుక ఉన్నది ఎవరు? అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ వ్యవహారం పై తీవ్రంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే..
ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకులకు బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ర్యాలీ తీస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడులకు నిరసనగా ఢిల్లీలోని ప్రధాని నివాసం దగ్గర నిన్న ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు ప్రియాంకగాంధీ, ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేస్ యాదవ్ ఇతర కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ అరెస్ట్ వ్యవహారం చిలికి చిలికి తుఫాన్ లా మారి పలు వివాదాస్పద సంఘటనలకు దారి తీసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా ఈ కార్యక్రమం కరీంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితితులకు తావిచ్చింది. భారీగా కాంగ్రెస్ శ్రేణులు కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు వెళ్ళిన నేపథ్యంలో.. వారిని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఫలితంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కరీంనగర్ వీధులు రణరంగాన్నితలపించాయి. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పనిచెప్పారు. కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను చెదరగొట్టి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు కాంగ్రెస్ దాడికి నిరసనగా బీజేపీ శ్రేణులు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. అయితే వారిని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో కరీంనగర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలను భారీగా మోహరింప చేశారు.












