నటసింహం నందమూరి బాలకృష్ణకు గాయం కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన తాజాగా హెల్త్ బులెటిన్‌తో అభిమానులకు కొంత ఊరట లభించింది.
మరోవైపు సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా బాలకృష్ణకు ఈ గాయం అయిన విషయం తెలిసిందే.. కాకినాడ పోర్ట్ పరిసరాల్లో బాలకృష్ణ నటిస్తున్న NBK111 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో బాలకృష్ణ, మంచు మనోజ్ పాల్గొనే ఓ హై-వోల్టేజ్ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. స్టంట్‌లో భాగంగా కదులుతున్న సమయంలో బాలకృష్ణ ప్రమాదవశాత్తూ జారిపడటంతో ఆయన ఎడమ కాలికి, ముఖ్యంగా మోకాలి ప్రాంతంలో గాయం అయినట్లు రిపోర్టులు వెల్లడించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి బాలకృష్ణకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను కాకినాడలోని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం చేరి వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
మోకాలి కండరాల్లో చీలిక ఉండే అవకాశం ఉందని కూడా వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణకు ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఇక తన మూవీలో యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండా తానే స్వయంగా చేస్తాడానే పేరున్న బాలయ్య బాబు త్వరగా కోలుకుని, మళ్లీ మునుపటి మాస్ జోష్‌తో షూటింగ్‌లో అడుగుపెట్టాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు!












