National

మోదీ స్పీడ్‌కు కాక్రోచ్‌ల బ్రేక్..!

రచన: Kashi11 నిమిషాల పఠనం

ప్ర‌స్తుతం కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేస్తున్న ఉద్య‌మం ప్ర‌ధాని మోదీకి తొలి స‌వాల్‌గా భావించ‌వ‌చ్చు. 2014లో కేంద్రంలో ఎన్డీయే స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నారు ప్ర‌ధాని. వాటిని చాలా ఈజీగా అధిగ‌మించ‌గ‌లిగారు. ఎంతో చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు. ఇలాంటి స‌మ‌యంలో సీజేపీ మొద‌లుపెట్టిన ఉద్య‌మం కేంద్ర పెద్ద‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది.

ఎన్డీయే స్పీడ్‌కు బ్రేకులేసిన‌ CJP

కాక్రోచ్‌ల నిర‌స‌న‌ల‌తో ఢిల్లీలో టెన్ష‌న్ టెన్ష‌న్

12 ఏళ్ల త‌ర్వాత మోదీ టీమ్‌లో ఆందోళ‌న‌

CJPతో చ‌ర్చ‌ల‌కు మంత్రుల ప్ర‌య‌త్నాలు

దేశ చ‌రిత్ర‌లో CJP సంచ‌ల‌నం

12 ఏళ్ల పాల‌న‌లో ప్ర‌ధాని మోదీకి తిరుగులేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ ఎంత పోరాడుతున్న మోదీని అందుకోలేక‌పోతుంది. ప్రాంతీయ పార్టీల మ‌ధ్య సయోధ్య లేక‌పోవ‌డంతో.. బీజేపీ జోరు కొన‌సాగుతూనే ఉంది. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వ‌చ్చిన ఇన్నేళ్ల త‌ర్వాత తొలిసారి ఆందోళ‌న మొద‌లైంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యంగ్య ఉద్య‌మంగా మొద‌లైన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ మోదీ స్పీడ్‌కు బ్రేకులేసింది. పైకి గంభీరంగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నా.. లోలోన మాత్రం కేంద్ర పెద్ద‌ల్లో టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. సీజేపీ పిలుపునిచ్చిన ఛ‌లో పార్ల‌మెంట్ క‌నీవినీ ఎరుగని రీతిలో స‌క్సెస్ అయింది. చుట్టు ప‌క్క‌ల రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు, యువ‌త భారీగా త‌ర‌లిరావ‌డంతో.. ఇప్ప‌టికీ ఢిల్లీలో టెన్ష‌న్ కొన‌సాగుతూనే ఉంది.

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేస్తున్న ప‌ని వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షం ఏనాడో చేయాల్సింది. నీట్ పేప‌ర్ లీకేజీతో ఎంతో మంది విద్యార్థులు చ‌నిపోయారు. ఎన్నో కుటుంబాలు నేటికీ శోకసంద్రంలోనే ఉన్నాయి. చేతికందిన పిల్ల‌లు చ‌నిపోవ‌డంతో త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఈ విష‌యంలో కేంద్రం తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏ మాత్రం సంతృప్తిక‌రంగా లేవ‌నేది పేరెంట్స్ చెబుతున్న మాట‌. అయినా వారి త‌ర‌ఫున గ‌ట్టిగా పోరాడిన వ్య‌క్తులు ఎవ‌రూ లేరు. కాంగ్రెస్ స‌హా ప్ర‌తిప‌క్ష పార్టీలు నిర‌స‌న‌లు చేప‌ట్టినా.. అవి ఢిల్లీని కాదు క‌దా.. గ‌ల్లీని కూడా క‌దిలించ‌లేక పోయాయి. అందుకే కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఈ స‌మ‌స్య‌ను తొలి స‌వాల్‌గా తీసుకుంది. విద్యార్థుల‌తో పాటు త‌ల్లిదండ్రుల మ‌ద్ద‌తును పొందగ‌లిగింది.

మోదీకి తొలి స‌వాల్...

ప్ర‌స్తుతం కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేస్తున్న ఉద్య‌మం ప్ర‌ధాని మోదీకి తొలి స‌వాల్‌గా భావించ‌వ‌చ్చు. 2014లో కేంద్రంలో ఎన్డీయే స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నారు ప్ర‌ధాని. వాటిని చాలా ఈజీగా అధిగ‌మించ‌గ‌లిగారు. ఎంతో చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు. ఒక ర‌కంగా ప్ర‌స్తుతం దేశంలో బీజేపీకి ఎదురులేదు. ప్ర‌ధాని మోదీకి తిరుగులేదు. రాజ‌కీయంగా అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ గేమ్ ఆడుతున్నారు ప్ర‌ధాని. వ‌రుస‌పెట్టి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌స్తున్నారు. ద‌క్షిణాదిలో త‌ప్ప కాంగ్రెస్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతోంది.

ఇలాంటి స‌మ‌యంలో సీజేపీ మొద‌లుపెట్టిన ఉద్య‌మం కేంద్ర పెద్ద‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఈ విష‌యంలో వారు బ‌య‌ట‌ప‌డ‌క‌పోయినా.. లోలోన మాత్రం ఎంతో మ‌ద‌న‌ప‌డుతున్నార‌ని నేష‌న‌ల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. 20వ తేదీన ఛ‌లో పార్ల‌మెంటు పేరుతో కాక్రోచ్ పార్టీ కార్య‌క‌ర్త‌లు చేప‌ట్టిన నిర‌స‌న‌, వారిపై లాఠీఛార్జ్, ఆ త‌ర్వాత అరెస్టులు.. ప్ర‌పంచం మొత్తం వైర‌ల‌య్యాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాలో కూడా దీనిపై చాలా వార్త‌లొచ్చాయి. బ‌హుషా ఈ స్థాయిలో కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడూ స‌వాళ్ల‌ను ఎదుర్కోలేదు. అందుకే వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. కాక్రోచ్ పార్టీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది.

కేంద్ర మంత్రి జేపీ. న‌డ్డా.. కాక్రోచ్ పార్టీ ప్ర‌తినిధుల‌ను పిలిచి మాట్లాడారు. వాస్త‌వానికి ఇదేం చిన్న విష‌యం కాదు. ఇప్ప‌టివ‌ర‌కు ఓ ఆఫీస్ కూడా లేని ఓ సోష‌ల్ మీడియా పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న ఈ స్థాయిలో స‌క్స‌స్ అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. ఇప్ప‌టికీ సీజేపీ అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌క‌పోయినా.. కేంద్రాన్ని మాత్రం క‌దిలించ‌గ‌లిగింది. ఢిల్లీ స‌ర్కారును మాత్రమే కాదు.. కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌ను కూడా రోడ్డుపై బైఠాయించేలా చేశారు కాక్రోచ్ కార్య‌క‌ర్త‌లు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక ఢిల్లీ రోడ్లెక్కి ఈ రేంజ్‌లో పోరాడిన దాఖ‌లాలు లేవు. కాక్రోచ్ పార్టీ మొద‌లుపెట్టిన ఉద్య‌మంలో కాంగ్రెస్ కూడా భాగ‌స్వామిగా మారిపోయింది. అందుకే మంగ‌ళ‌వారం ఢిల్లీలో హ‌స్తం పార్టీ షో న‌డిచింది. ఇదే స‌మ‌యంలో సీజేపీ ఉద్య‌మాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసింద‌నే వాద‌న‌లూ వినిపిస్తున్నాయి.

కాక్రోచ్ పార్టీ బ‌లం... జెన్ జీ

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ బ‌లం, బ‌లగం.. జెన్ జీ. సోషల్ మీడియాలో పోస్టుల‌కే ప‌రిమిత‌మ‌య్యే యువ‌త రోడ్డెక్కుతారా అని సందేహ‌ప‌డ్డ వారంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింది యూత్. సెంట్ర‌ల్ ఢిల్లీ సహా దేశ రాజ‌ధాని మొత్తం ఇప్పుడు కాక్రోచ్‌ల గోల‌నే. ఆగ‌స్టు 13 దాకా పార్ల‌మెంటు సమావేశాలు కొన‌సాగ‌నున్నాయి. అప్ప‌టిదాకా ఈ పార్టీ నిర‌స‌న‌లు ఆగ‌క‌పోవ‌చ్చు. ఒక ర‌కంగా ఈ 20 రోజులు సీజేపీకి మంచి బూస్టింగ్ టైమ్. నేష‌న‌ల్, ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా అటెన్ష‌న్ కూడా ఇటువైపే ఉంది. ఈ క్రమంలో సీజేపీ చేసే ప్ర‌తి నిర‌స‌న జ‌నానికి ఈజీగా తెలిసిపోతుంది.

కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే దాకా త‌మ ఉద్య‌మం ఆగ‌ద‌ని సీజేపీ తేల్చిచెబుతోంది. కేంద్ర‌మంత్రితో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా కూడా ఆ పార్టీ ప్ర‌తినిధులు ఇదే విష‌యాన్ని క్లారిటీగా చెప్పారు. ఎవ‌రు చ‌ర్చ‌ల‌కు వ‌చ్చినా.. త‌మ ఏకైక డిమాండ్ ఇదే అని తేల్చి చెబుతున్నారు. సీజేపీ ఉద్య‌మానికి విప‌క్ష పార్టీల‌న్నీ మ‌ద్ద‌తిస్తుండ‌డంతో ఉద్య‌మం ఇంకా ఉధృతం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా యూత్ క‌నెక్ట‌యిన ఉద్య‌మంగా కాక్రోచ్‌ల పోరాటం రూపాంత‌రం చెందింది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి దాకా చ‌దువుకునే ప్ర‌తి ఒక్క‌రూ కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు.

పొలిటిక‌ల్ పార్టీగా CJP

ప్ర‌స్తుతం ఉద్య‌మంగా కొన‌సాగుతున్న CJP ప్ర‌స్థానం పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంటుందా..? ఇప్పుడిదో పెద్ద ప్ర‌శ్న‌. ఇప్ప‌టికిప్పుడే ఆ దిశ‌గా అడుగులు ప‌డ‌క‌పోవ‌చ్చు. కానీ భ‌విష్య‌త్‌లో ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు. వీళ్లు చేస్తున్న ఉద్య‌మానికి ద‌క్కే విజ‌యాల‌ను బ‌ట్టి.. సీజేపీ భ‌విష్య‌త్ ఉంటుంది. జనం నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తుండ‌డంతో.. కేంద్ర ప్రభుత్వం కూడా వీరి డిమాండ్ల‌ను వింటోంది. ఒక‌వేళ ఆ డిమాండ్ల‌ను నెర‌వేరిస్తే మాత్రం... సీజేపీ విజ‌యాల ప‌రంప‌ర మొద‌లైన‌ట్టే. అదే జ‌రిగితే... రానున్న రోజుల్లో ఈ పార్టీ పొలిటిక‌ల్ అడుగులు వేయ‌డం ప‌క్కా.

#CJP#Delhi Protest#NEET#NDA Government#Narendra Modi#JP Nadda#Dharmendra Pradhan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి