ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏడు కేసులు నమోదైనట్టు తెలుస్తున్నది.ఇప్పటివరకు కరోనాతో అక్కడ నలుగురు మరణించారు. దీంతో అప్రమత్తమైన కూటమి సర్కార్ కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచింది. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చినవారిని ఐసోషలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ అని గుర్తించారు. ఇదిలాఉంటే తెలంగాణలోనూ కరోనా వైరస్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతున్నట్టు సమాచారం. చాప కింద నీరులా విస్తరిస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే గతనెల హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన 38ఏళ్ల మహిళ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ సిటీ స్కాన్ చేశారు.రిపోర్టులో లంగ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు గుర్తించారు.
ఆ వెంటనే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె కొన్ని గంటల్లోనే మృతి చెందింది. రిపోర్టులు పరిశీలించిన ఓ ప్రభుత్వ వైద్యుడు కరోనా కారణంగానే ఆమె మరణించిందని నిర్దారించారు. గత నెలలో గాంధీలో ఓ కరోనా కేసు నమోదు అయినట్టు తెలిసింది.ఏపీలో కేసులు పెరుగుతున్నా రాష్ట్రంలో మాత్రం కొవిడ్ టెస్టులు మాత్రం పెంచడం లేదు. ఎందుకంటే అక్కడ పాజిటివ్ వచ్చిన వారికి ప్రైమరీ కాంటాక్ట్ పర్సన్స్ తెలంగాణకు వచ్చి ఉంటారని, ఈ విషయం ఎవరికి తెలియకపోవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో చాలా మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నా కేవలం మెడిసిన్ ఇచ్చి పంపిస్తుండటం ఆందోళనకు దారితీస్తున్నది. చాలా మందికి కరోనా బయటపడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అందువల్లే కేసులు ఉన్నప్పటికీ ప్రజారోగ్యవిభాగం కేసుల సంఖ్యను సున్నాగా చూపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కిట్లు సైతం అందుబాటులో లేవని విమర్శలు వినిపిస్తున్నాయి.












