భారతీయ రైల్వేలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన వందేభారత్ రైళ్లకు స్లీపర్ వెర్షన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు కూర్చుని మాత్రమే కాకుండా.. బెర్త్‌లపై హాయిగా నిద్రిస్తూ వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ రైళ్లను రూపొందించారు.
ప్రస్తుతం విజయవాడ డివిజన్ మీదుగా పలు సాధారణ వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి, కాచిగూడ–బెంగళూరు, నరసాపురం–చెన్నై మార్గాల్లో వందేభారత్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్‌లో వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ డివిజన్ పరిధిలో దసరా నాటికి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి పలు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం–బెంగళూరు, విజయవాడ–బెంగళూరు మార్గాల్లో స్లీపర్ వందేభారత్ రైళ్లను నడపాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.
అదేవిధంగా విజయవాడ నుంచి అయోధ్యకు, ఢిల్లీకి కూడా వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలనే డిమాండ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ రూట్‌లో ఈ రైళ్లను నడపాలనే అంశం పై దసరా నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు వందేభారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లతో పాటు ఆధునిక ఇంటీరియర్స్, ఎల్‌ఈడీ లైట్లు, సౌండ్‌ప్రూఫ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సౌకర్యం కోసం వైఫై, ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోర్లు కూడా ఉంటాయి. భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక సెన్సర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణంలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతి కలిగేలా బోగీలను డిజైన్ చేశారు. అలాగే రైళ్లు గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు.
ఒక్కో రైలులో 16 కోచ్‌లు ఉండే అవకాశం ఉంది. అలాగే కనీస ఛార్జీ సుమారు రూ.960 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రైళ్లలో సాధారణ రైళ్ల మాదిరిగా ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్ విధానం ఉండదని చెబుతున్నారు. దీంతో వందేభారత్ స్లీపర్ రైళ్ల పై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.












