కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడానికి ఈనెల 26న ఆయన కరీంనగర్‌కు రానున్నారు. అయితే ఈ పర్యటన కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమానికే పరిమితం కాదనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.
రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక అమిత్ షా పర్యటనకు ముందే తెలంగాణ బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ ఇప్పటికే పలువురు కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే అందరూ సమన్వయంతో ముందుకు సాగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం.
మరోవైపు ఇటీవల తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా వరుసగా కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో పార్టీ విస్తరణకు తెలంగాణను కీలక కేంద్రంగా బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా కరీంనగర్ పర్యటనపై మరింత ఆసక్తి నెలకొంది.
ఇక అమిత్ షా పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే.. ఈనెల 26న ఉదయం 11 గంటల 35 నిమిషాలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 12 గంటల 50 నిమిషాలకు హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు బయలుదేరుతారు.
మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 1 గంట 55 నిమిషాలకు కార్యక్రమ వేదికకు చేరుకుని, 2 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు భోజన విరామం తీసుకుంటారు.
ఆ తర్వాత 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరి, 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
అయితే అమిత్ షా పర్యటనలో రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ ఉంటుందా? తెలంగాణ బీజేపీలో విభేదాలకు నిజంగానే ఫుల్‌స్టాప్ పడుతుందా? పార్టీ భవిష్యత్ వ్యూహంపై ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.












