ఢిల్లీలో నిన్న సాయంత్రం ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీలు ప్రియాంకగాంధీ,ఖర్గే, ఇండియా కూటమి ఎంపీలు, కాంగ్రెస్ నేతలు యత్నించిన విషయం తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు అక్కడ నిరసన కొనసాగింది. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు వారిని అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించింది. ఈ ఘటనలో రాహుల్ గాంధీకి స్వల్ప గాయం అయినట్టు తెలిసింది. అయితే, రాహుల్, ప్రియాంక గాంధీల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం, ఢిల్లీ పోలీసుల తీరును నిరసిస్తూ తన సొంత నియోజకవర్గం కొడంగల్ వేదికగా బుధవారం సీఎం రేవంత్ సమరశంఖం పూరిస్తారని తెలుస్తున్నది. కొడంగల్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించనున్న భారీ నిరసన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొంటారని తెలిసింది. నిన్న హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పర్యటన, అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రాత్రి కొడంగల్‌కు చేరుకుని అక్కడే తన నివాసంలో బస చేశారు.
బుధవారం ఉదయం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాకు సీఎం చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి తీరును ఎండగడుతూ సీఎం కీలక ప్రసంగం చేస్తారని తెలుస్తోంది. దీంతో కొడంగల్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానిక కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఏర్పాట్లలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. సీఎం రాకతో కొడంగల్ పట్టణానికి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండగా... పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.












