దేశరాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంటులో చర్చ, విద్యారంగ సమస్యలు పరిష్కారం, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీప్రతినిధులు, విద్యార్థులు నిన్న కూడా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విషయం తెలిసిందే.అయితే, మధ్యాహ్నం ఉన్నట్టుండి రాహుల్ గాంధీ,ఇండియా కూటమి ఎంపీలు ప్రధాని నివాసం ముట్టడికి యత్నించారు. ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది.
కేంద్రమంత్రి జితేంద్రసింగ్ రాహుల్ గాంధీకి కాల్ చేసి నీట్ మీద ఇవాళ పార్లమెంటులో చర్చకు కేంద్రం ఓకే చెప్పిందని తెలిపినా రాహుల్ పదే పదే తన డిమాండ్లను మార్చారని ఆయన తెలిపారు. ముందు నీట్ మీద చర్చ జరపాలని అన్నారని.. ఆ తర్వాత కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని అంటున్నారని మీడియాకు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాపై తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల పేరును వాడుకుని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సొంత రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేవలం రాజకీయ ప్రచారం కోసమే దేశంలోని విద్యార్థులను అడ్డు పెట్టుకోవడం ఎంత మాత్రం సరైనది కాదని హితవు పలికారు.విద్యార్థుల భవిష్యత్‌తో రాజకీయాలు చేయకూడదని, వారి పట్ల ప్రతిఒక్కరూ గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో గానీ, బయట గానీ సమగ్రమైన చర్చ జరపడానికి కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంచేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు, ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు.












