ఒక చిన్న పాత్రలో నీరు.. కొన్ని మామిడి ఆకులు.. పైన కొబ్బరికాయ! చూడటానికి సాధారణంగా కనిపించే ఈ కలశం.. సనాతన ధర్మంలో మాత్రం సృష్టి, పవిత్రత, ఐశ్వర్యం, దైవిక శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే.. గృహప్రవేశం అయినా, వివాహం అయినా, యజ్ఞం అయినా, సత్యనారాయణ వ్రతం అయినా, నవరాత్రుల పూజలు అయినా.. ఏ శుభకార్యమైనా కలశ ప్రతిష్ఠతోనే ప్రారంభమవుతుంది.
హిందూ ధర్మ విశ్వాసాల ప్రకారం.. కలశం త్రిమూర్తుల స్వరూపంగా భావించబడుతుందని.. కలశం ముఖ భాగంలో శ్రీమహావిష్ణువు, మధ్యభాగంలో పరమశివుడు, అడుగుభాగంలో బ్రహ్మదేవుడు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కలశం.. సృష్టి, స్థితి, లయ అనే విశ్వ చక్రానికి ప్రతీకగా పరిగణించబడుతుంది.
ఇక కలశంలో నింపే నీరు కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరి వంటి పవిత్ర నదుల స్వరూపంగా ఈ నీటిని భావిస్తారు. అందుకే వీలైనప్పుడు గంగాజలం లేదా పవిత్ర తీర్థజలాన్ని కలశంలో కలపడం సంప్రదాయంగా వస్తోంది. అదేవిధంగా కలశ ప్రతిష్ఠ చేసిన తర్వాతే దేవతలను ఆవాహన చేసి పూజను ప్రారంభించడం ఆనవాయితీ.
ఈ సంప్రదాయం ద్వారా పూజా స్థలం పవిత్రమై.. ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల శక్తి ఆహ్వానించబడుతుందని భక్తుల విశ్వాసం. అయితే కలశంలోని ప్రతి అంశానికి కూడా ప్రత్యేకమైన అర్థం ఉంది. కలశం గుండ్రని ఆకారం.. భూమి, విశ్వం, సంపూర్ణతకు ప్రతీక. అందులోని నీరు.. జీవం, సృష్టి, పవిత్రత, శ్రేయస్సును సూచిస్తుంది.. కలశానికి అలంకరించే మామిడి ఆకులు.. అభివృద్ధి, ఆరోగ్యం, సంతాన సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు.
అలాగే పైన ఉంచే కొబ్బరికాయ.. లక్ష్మీ కటాక్షం, సంపద, విజయం కలగాలని సూచించే పవిత్ర ప్రతీక అని చెబుతారు. అందుకే కలశం కేవలం ఒక పాత్ర కాదు.. అది సృష్టికి ప్రతీక.. పవిత్రతకు ప్రతిరూపం.. ఐశ్వర్యానికి సంకేతం.. దైవిక శక్తికి ఆవాసం. అందుకే కలశ ప్రతిష్ఠతో ప్రారంభమైన శుభకార్యం విజయవంతంగా పూర్తవుతుందని.. ఇంట్లో శాంతి, ఆనందం, సానుకూల శక్తి, శ్రేయస్సు నిండుతాయని భక్తుల విశ్వాసం. కాబట్టి నేటికీ.. ప్రతి మంగళకార్యంలో మొదటి గౌరవం కలశానికే. ఇది కేవలం ఒక ఆచారం కాదు.. తరతరాలుగా కొనసాగుతున్న సనాతన ధర్మంలోని పవిత్రమైన ఆధ్యాత్మిక సంప్రదాయం!
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..












