మనసుకు వచ్చిన భావోద్వేగాలు.. కేవలం మన ఆలోచనలకే పరిమితం కావు. అవి మన శరీరంపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. మనసు, శరీరం వేర్వేరు కాదు.. ఒకదానికొకటి లోతైన బంధంతో ముడిపడి ఉంటాయి. సంతోషం, ప్రేమ, కృతజ్ఞత వంటి సానుకూల భావాలు కలిగినప్పుడు.. మెదడులో ఎండార్ఫిన్లు వంటి సంతోషకర హార్మోన్లు విడుదలవుతాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. కణజాలం త్వరగా కోలుకునేందుకు, గుండె ప్రశాంతంగా పనిచేసేందుకు సహాయపడతాయి. అయితే.. కోపం, భయం, బాధ, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలు ఎక్కువకాలం కొనసాగితే.. శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఇవి క్రమంగా మన అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..
అందుకే నిపుణులు.. యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులతో భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు. మరి ఏ భావోద్వేగం.. ఏ అవయవంపై ప్రభావం చూపుతుంది? దాన్ని నియంత్రించేందుకు ఏ యోగాసనం ఉపయోగపడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణులు చెప్పిన ప్రకారం ముందుగా.. కోపం వస్తే దాని ప్రభావం ఏంటనేది చూద్దాం..
తీవ్రమైన కోపం వచ్చినప్పుడు అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఒక్కసారిగా విడుదలవుతాయి. ఇది కాలేయంపై ఒత్తిడిని పెంచుతుంది. శరీరంలోని విషతుల్యాలను తొలగించే కాలేయం.. నిరంతర కోపం, ఒత్తిడి కారణంగా బలహీనపడే అవకాశం ఉందంటున్నారు. ఈ భావోద్వేగాన్ని నియంత్రించేందుకు చంద్ర భేదన ప్రాణాయామం ఉపయోగపడుతుందని చెబుతున్నారు..
చంద్ర భేదన ప్రాణాయామం అంటే.. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాసను పీల్చుకుని.. కుడి ముక్కు రంధ్రం ద్వారా వదలాలి. ఇది మనసును ప్రశాంతపరిచి, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఇక.. బాధ లేదా తీవ్రమైన విచారం కలిగినప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మన శ్వాస తీరు మారుతుంది. ఊపిరితిత్తులు కుంచించుకుపోయినట్లు అనిపించవచ్చు. దీర్ఘకాలిక బాధ వల్ల శ్వాస సామర్థ్యం కూడా ప్రభావితం కావచ్చు.. ఇలాంటి సమయంలో ఉష్ట్రాసనం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.. ఇది ఎలా చేయాలంటే.. ముందుగా మోకాళ్లపై నిలబడి, శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనుకకు వంగి మీ మడమలను పట్టుకోండి.
ఈ ఉష్ట్రాసనం వేయడం ద్వారా ఛాతీని విస్తరించి.. ఊపిరితిత్తులకు గాలి బాగా అందేలా చేస్తుంది. మనసులోని భారాన్ని తగ్గించేందుకు కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇక సంస్కృతంలో 'ఉష్ట్రం' అంటే ఒంటె అని అర్థం. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం ఒంటె ఆకారాన్ని పోలి ఉండటం వల్ల దీనికి ఉష్ట్రాసనం అనే పేరు వచ్చిందట.
అలాగే విపరీతమైన ఆందోళన ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగించవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఆందోళన జీర్ణాశయాంతర వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తుంది. ఈ సమయంలో పశ్చిమోత్తాసనం మనసును ప్రశాంతపరచడంతో పాటు.. వెన్నెముకను సాగదీసి, జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఈ ఆసనం వేసే విధానం.. కాళ్లు చాపి కూర్చుని, శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగి చేతులతో కాలి వేళ్లను పట్టుకోండి.
అలాగే అతి అనుబంధం.. ఏదైనా వ్యక్తి లేదా వస్తువు పట్ల విపరీతమైన అనుబంధం ఉండటం.. అది దూరమవుతుందనే భయం లేదా కోల్పోతామనే బాధను పెంచుతుంది. ఈ మానసిక ఒత్తిడి గుండెపై ప్రభావం చూపి.. గుండె లయను కూడా ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి భావోద్వేగాలను నియంత్రించేందుకు ఓంకార జపం ఉపయోగపడుతుంది. ఇది మనసుకు ప్రశాంతతను అందించి.. గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని యోగా నిపుణులు అంటున్నారు.
అదేవిధంగా భయపడినప్పుడు శరీరం ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ స్థితిలోకి వెళ్తుందట. ఈ సమయంలో మూత్రపిండాలపై ఉన్న అడ్రినల్ గ్రంథులు అధికంగా పనిచేస్తాయి. దీంతో శరీరంలో ఒత్తిడి పెరిగి.. భయాందోళనలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని.. ఈ భయాన్ని తగ్గించేందుకు అనులోమ విలోమ ప్రాణాయామం సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ ఆసనం నాడీవ్యవస్థను శాంతపరచి.. మెదడుకు మనం సురక్షితంగా ఉన్నాం అనే సంకేతాన్ని అందించడంలో సహాయపడుతుంది.
ఈ ఆసనం చేసే విధానం.. ముందుగా సుఖాసనంలో కూర్చుని.. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుని, ఎడమ వైపు నుంచి వదలండి. మళ్లీ ఎడమ ముక్కుతో తీసుకుని, కుడి వైపు నుంచి వదలండని అంటున్నారు. మరోవైపు యోగా, ప్రాణాయామం ఆరోగ్యానికి సహాయక పద్ధతులు మాత్రమే. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే.. తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












