పుదీనా.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది దాని ఫ్రెష్ వాసన, రుచి. అందుకే చాలా మంది పుదీనాను చట్నీలు, జ్యూస్‌లు, సలాడ్లు, టీతో పాటు వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. జీర్ణక్రియను మెరుగుపరచడం, నోటి దుర్వాసనను తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజనాలు పుదీనాకు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే.. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే మంచిది. పుదీనా కూడా ఇందుకు మినహాయింపు కాదు. అతిగా తీసుకుంటే కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రో ఈసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, అంటే GERD లేదా తరచూ గుండెల్లో మంటతో బాధపడేవారు పుదీనాను తీసుకోవడంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
అలాగే పుదీనాలోని కొన్ని గుణాలు అన్నవాహిక కండరాలను సడలించవచ్చు. దీంతో కడుపులోని ఆమ్లాలు పైకి రావడం, గుండెల్లో మంట మరింత పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక చర్మం సున్నితంగా ఉన్నవారు పుదీనా ఆకులు లేదా పుదీనా నూనెను ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలని, కొందరిలో అలర్జీ కారణంగా దద్దుర్లు, దురద, చర్మంపై మంట వంటి సమస్యలు రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు పుదీనాను అధికంగా తీసుకుంటే తలనొప్పి, నోటి పూత లేదా గొంతులో మంట వంటి ఇబ్బందులు కొందరిని వేధించవచ్చు. ఇక కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పుదీనాను ఎక్కువగా తీసుకోకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదిని అంటున్నారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కూడా పుదీనా నూనె లేదా అధికంగా పుదీనా ఉన్న పదార్థాలను వైద్యుల సలహా లేకుండా తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
అదేవిధంగా.. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండేవారు కూడా పుదీనాను అధికంగా తీసుకోకుండా జాగ్రత్త వహించాలని వెల్లడిస్తున్నారు. మొత్తానికి పుదీనా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. మితంగా తీసుకోవడమే ముఖ్యం. మీకు ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, పుదీనాను ఔషధంలా ఎక్కువగా తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి. సరైన మోతాదులో తీసుకుంటేనే.. ఈ సహజ మూలిక అందించే ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












