తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం మారనుంది. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. బుధవారం లేదా గురువారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












