ఢిల్లీలో నిన్న పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ సీజేపీ పిలుపు మేరకు విద్యార్థులు భారీగా తరలివచ్చి ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.అయితే,సోమవారం చేపట్టిన నిరసనలు కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీసులు, బలగాలు విద్యార్థులు, నిరసన కారులపై ఇష్టానుసారంగా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. పలువురికి తీవ్ర గాయాలు అవ్వగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ ఘటనలపై సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా స్పందించారు.
విద్యార్థి, యువజన ఉద్యమం స్వాతంత్రం అనంతరం భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద పోరాటంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు.ఈ నెల 20న జరిగిన నిరసన కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది యువకులు ఢిల్లీకి తరలివస్తారని కేంద్రంలోని మోడీ సర్కారును హెచ్చరించారు.యువత ఆగ్రహానికి గురికాక ముందు ప్రభుత్వం తన తీరు మార్చుకుని సీజేపీ ఉంచిన మూడు ప్రధాన డిమాండ్లను నెరవేర్చలన్నారు.
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, గాంధీ, అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. పోలీసులు దౌర్జన్యంగా దాడులు చేసి విద్యార్థులను కొట్టడం వల్లే ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని ఆరోపించారు. అయితే.. నిరసనకారులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ఆందోళన విరమించేది లేదని సీజేపీ నేత అభిజీత్ దీప్కే చెప్పినట్టు ఆయన వెల్లడించారు.ఉపా(UAPA), ఎన్ఎస్ఎ (NSA) వంటి కఠిన చట్టాల కింద అరెస్టు అయ్యేందుకు, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కొన్నారు. విద్యార్థుల డిమాండ్ సమంజసమైనదని, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అశుతోష్ రంకా పిలుపునిచ్చారు.












