దేశరాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే, జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు విద్యార్థులు సైతం అక్కడకు పెద్దఎత్తున చేరుకుంటున్నట్టు సమాచారం. నిన్న ప్రధాని మోడీ నివాసం ముట్టడిలో అరెస్టు అయి విడుదలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు ఇండియా కూటమి ఎమ్మెల్యేలు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు.
అయితే, విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసుల లాఠీచార్జి, నీట్ పేపర్ లీకేజీ ఘటనలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ క్రమంలోనే కేంద్రం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బుధవారం ఉదయం పార్లమెంటు సమావేశాలకు హాజరైన విపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు.
సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలు,కేంద్రం వైఖరికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్ష నేతలందరూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తామంతా నల్ల దుస్తులు ధరించామని తెలిపారు.
దేశంలోని విద్యార్థుల పట్ల కేంద్రం అన్యాయం చేస్తున్నదని, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం లేదన్నారు. ఆయన్ను పదవిలో కొనసాగించడంపై కేంద్రం తీరును తప్పుబట్టారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయ్యిందని విమర్శించారు.












