తన సొంత నియోజకవర్గం కొడంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో తనను దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని సీఎం వ్యాఖ్యానించడం సర్వత్రా చర్చకు దారితీసింది.
బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు చేస్తున్న తప్పులు నిత్యం ప్రశ్నిస్తున్నానని కొడంగల్‍లో తనను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గులాబీ, కాషాయం పార్టీలు సిద్ధంత పరంగా వేరైనా వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటేనని తెలిపారు. కావాలనే కాంగ్రెస్‍కు ఓటు వేసిన వారిని ఓట్లను తొలగిస్తున్నారని, కొడంగల్‍లో తనపై కుట్రలు చేసినవాళ్లను ఇక్కడి ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం కొడంగల్‍లో పర్యటించిన సీఎం రేవంత్.. తన ఎస్ఐఆర్ ఫారమ్ నింపి అధికారులకు అందజేశారు. అనంతరం కొడంగల్‍లో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఏలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు పనిచేసినా టైం సరిపోవడం లేదన్నారు. ప్రతిపేదవాడికి మంచి చేసేందుకు కృషి చేస్తున్నామని, కొడంగల్ లో 78 శాతం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఓటు లేని మనిషి చచ్చిపోయిన వారితో సమానం అని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోతే ప్రభుత్వ పథకాలు రావని వెల్లడించారు. అందువల్ల ప్రతిఒక్కరూ ‘ఎస్ఐఆర్’ ఫారమ్ నింపి బీఎల్‌వోలకు అందజేసి ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు. ఆ తర్వాత ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కొడంగల్‍లో పార్టీ నేతలతో కలిసి ముఖ్యమంత్రి ధర్నా ర్యాలీలో పాల్గొన్నారు.












