Cm Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. హస్తిన పర్యటనలో ఆయన బిజీబిజీగా ఉన్నారు. తన టూర్ లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ప్రధాని మోదీని కూడా చంద్రబాబు కలిశారు. ప్రధాని మోదీతో అరగంటకుపైగా సమావేశం అయ్యారు చంద్రబాబు. తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అటు భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆగస్టు 1న ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వస్తానని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. గంగా, కావేరి నదుల అనుసంధానంపైనా మోదీ, చంద్రబాబు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
ప్రధానితో భేటీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ఖట్టర్ లను కలిశారు. ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, టీడీపీ బీజేపీ జనసేన ఎంపీలు ఉన్నారు. పోలవరం, జల్ జీవన్ మిషన్ పై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ వర్క్ స్టాప్ ఆర్డర్ ని పూర్తిగా ఎత్తివేసేలా చూడాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి పాటిల్ ను కోరారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు రావాలని కేంద్రమంత్రి పాటిల్ ను కోరారు చంద్రబాబు. ఒడిశా, ఛత్తీస్ ఘడ్ లో పోలవరం ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. అలాగే పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్ట్ ప్రతిపాదనల పురోగతిపైనా చంద్రబాబు చర్చించారు.












