Cockroach Janata Party: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ పట్టుదలగా ఉంది. ఆందోళనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపినా.. సీజేపీ మాత్రం తగ్గేది లేదంటోంది. కేంద్రంతో చర్చల విషయంలో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే కొత్త కండీషన్ పెట్టారు. తాము ప్రభుత్వం వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పిన ఆయన.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా జంతర్ మంతర్ కే వచ్చి చర్చలు జరపాలని తేల్చి చెప్పారు. ఇక, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ సహా తమ ఇతర షరతులకు కేంద్రం అంగీకరిస్తేనే చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు.
"వారు మమ్మల్ని చర్చలకు పిలిచారు. మేము వారి కార్యాలయానికి గానీ, నివాసానికి గానీ వెళ్ళము. చర్చలు జంతర్ మంతర్ వద్ద లేదా తటస్థ ప్రదేశంలో జరుగుతాయి. మొదటి రోజు నుంచే చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము. మొన్న కూడా వారు మమ్మల్ని సంప్రదించారు. వారు మంత్రులు కాబట్టి భద్రతాపరమైన సమస్యలు ఉండొచ్చని మాకు అర్థమవుతోంది. మేము 'కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా'లో సమావేశం కావచ్చు" అని సీజేపీ నేత సౌరవ్ దాస్ అన్నారు.
నీట్ పేపర్ లీక్ పై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నాయకులతో మరో విడత చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆ పార్టీ ప్రతినిధి బృందంతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. దీనిపై సీజేపీ నేత దాస్ స్పందించారు. తమ బృందం చర్చలకు సిద్ధంగానే ఉందన్నారు. అయితే మంత్రులను వారి కార్యాలయాల్లో లేదా నివాసాల్లో మాత్రం కలవబోమని స్పష్టం చేశారాయన.
ఇదిలా ఉండగా, లోక్‌సభలో నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించిన అనంతరం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. పేపర్ లీక్ పై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం సభకు తెలియజేసిన కాసేపటికే ప్రధాన్ బిర్లాను కలిశారు. చర్చకు సంబంధించిన నిబంధనలు, తేదీ, వ్యవధిని నిర్ణయించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం స్పీకర్‌ను కోరింది.












