తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రబీ.. అంటే యాసంగి సీజన్‌కు సంబంధించి అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటివరకు తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతి ఉండగా.. తాజాగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం సేకరణ పరిమితి 43 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. కాగా ఈ నిర్ణయం రైతుల వద్ద ఉన్న పంటలో మరింత మొత్తాన్ని ప్రభుత్వ సేకరణ పరిధిలోకి తీసుకురావడానికి మార్గం సుగమమైంది.
పంట చేతికొచ్చిన సమయంలో కొనుగోళ్లపై రైతుల్లో ఉండే ఆందోళనకు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యాసంగి సీజన్‌లో ధాన్యం దిగుబడి పెరగడం, మార్కెట్‌కు పెద్ద ఎత్తున పంట రావడంతో అదనపు సేకరణ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని అదనపు కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రాష్ట్ర అవసరాలు, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతి ఇచ్చింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతుల పంట విక్రయానికి మరింత భరోసా లభించనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు.. మార్కెట్‌లో రైతులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు అదనపు ధాన్యం కొనుగోళ్లకు అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
మొత్తంగా చూస్తే.. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం రైతులకు కీలక సమయంలో ఊరటనిచ్చే అంశంగా మారింది. అన్నదాతలకు మరింత ప్రయోజనం చేకూర్చే అవకాశం కూడా ఉంది.












