కొందరికి కలలు అంటే ఏంటో తెలియకుండానే వారి జీవితంలో ఏ లోటు లేకుండా అన్నీ ఎదురుగా వస్తాయి. మరికొందరికి మాత్రం ఆశలు పెంచుకోవడం, కలలు కనడం తప్పితే అవి ఎప్పుడు నిజం అవుతాయో తెలియని పరిస్థితుల్లో బ్రతికేస్తుంటారు. అలా 48 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ గ్రామ ప్రజల కల.. ఎట్టకేలకు తాజాగా నిజమైంది.
దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూసిన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాలగూడెం గ్రామస్థుల కల ఇప్పుడు నెరవేరింది. దేశం, రాష్ట్రం అభివృద్ధి బాటలో పరుగులు తీస్తున్నా.. ఈ గ్రామానికి మాత్రం రవాణా సౌకర్యం ఇప్పటి వరకు అందని దూరంలోనే ఉండిపోయింది. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం చేస్తుంటే.. జానాలగూడెం ప్రజలు మాత్రం విద్య, వైద్యం, అత్యవసర పనుల కోసం రోజు దాదాపు 8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.
పాఠశాలకు వెళ్లే చిన్నారులు, వైద్యం కోసం వెళ్లే వృద్ధులు, అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాల్సిన కుటుంబాలు.. వీళ్ళంతా ఏళ్ల తరబడి నడిచే వెళ్లాల్సి వచ్చింది. తరతరాలుగా రహదారిపై నడిచి నడిచి అలసిపోయిన ఆ పాదాలకు.. ఇప్పుడు ఉపశమనం లభించింది.
గ్రామస్థుల కష్టాలను గుర్తించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రజల రవాణా సమస్యకు పరిష్కారం చూపుతూ.. జానాలగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు. 48 ఏళ్ల తర్వాత తొలిసారిగా బస్సు గ్రామంలోకి అడుగుపెట్టడంతో.. జానాలగూడెంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామస్థులు బస్సుకు పూజలు చేసి, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.












