Parliament: నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతోంది. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. అటు లోక్ సభలో, ఇటు రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించగా.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశాకే పార్లమెంటులో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ నచ్చజెప్పినా ప్రతిపక్షాల సభ్యులు వినిపించుకోలేదు. నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలను హోరెత్తించారు. దీంతో పలు మార్లు వాయిదా పడ్డాయి ఉభయ సభలు.
అయినప్పటికి మార్పు కనిపించకపోవడంతో ఉభయసభలు రేపటికి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇండీ కూటమి నేతల ప్రవర్తనపై జేపీ నడ్డా మండిపడ్డారు. విపక్ష సభ్యులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని జేపీ నడ్డా సీరియస్ అయ్యారు. అటు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను సంప్రదించిన తర్వాత చర్చకు సమయాన్ని నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు.
నీట్ పేపర్ లీక్, సోమవారం నాటి 'సంసద్ చలో' మార్చ్ సందర్భంగా నిరసనకారులపై పోలీసుల చర్యకు సంబంధించి ప్రతిపక్షాలు పదేపదే అంతరాయం కలిగించాయి. దాంతో పార్లమెంటు ఉభయ సభలు బుధవారం వాయిదా పడ్డాయి. కాగా నీట్ పేపర్ లీక్ అంశంపై సమగ్ర చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
లోక్‌సభలో నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అయితే, అన్ని పార్టీల సభాపక్ష నాయకులతో సంప్రదించిన తర్వాత చర్చకు సంబంధించిన నిబంధన, తేదీ, వ్యవధిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటులో ఈ అంశంపై చర్చించడానికి బదులుగా ప్రతిపక్షాలు వీధుల్లోకి రావడంపై ఆయన విమర్శలు గుప్పించారు. యువతకు సంబంధించిన సున్నితమైన అంశాలపై సభలో చర్చ జరగాలని అన్నారు. వీధి ఆందోళనల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవని రిజిజు నొక్కి చెప్పారు.
కాగా, ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
"మా డిమాండ్ చాలా స్పష్టమైనది. దేశమంతా విద్యార్థుల వేదనను అనుభవిస్తున్న తరుణంలో, సభకు సంబంధించిన ఇతర కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టి, ఈ అత్యంత కీలకమైన అంశానికి పార్లమెంటు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి" అని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ అన్నారు.












