తెలంగాణ

Bhatti Vikramarka: ఆలయాల భూములపై రేవంత్ సర్కార్ కీలక ఆలోచన!..

రచన: Venu4 నిమిషాల పఠనం

తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న దేవాదాయ శాఖ భూములను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. ఆలయాలకు చెందిన ఖాళీ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

తెలంగాణలో నిరుపయోగంగా ఉన్న దేవాదాయ శాఖ భూములను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. ఆలయాలకు చెందిన ఖాళీ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. దేవాదాయ భూములను కేవలం ఖాళీగా ఉంచకుండా.. వాటిని ఆలయాలకు ఆదాయ వనరులుగా మార్చడంతో పాటు రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ఉపయోగపడేలా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

వరంగల్ పర్యటనలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత ఏర్పడిందన్నారు. నీటి లభ్యత తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం పడిందని తెలిపారు. ఇదే సమయంలో అనూహ్యంగా విద్యుత్ డిమాండ్ ఏకంగా 7 వేల మెగావాట్లు పెరగడం విద్యుత్ శాఖకు పెద్ద సవాలుగా మారిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిపై మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా దేవాదాయ శాఖకు చెందిన నిరుపయోగ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.. ముఖ్యమంత్రి 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే రాష్ట్రంలో కరువు వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎల్‌నినో ప్రభావంపై హెచ్చరిస్తున్నప్పటికీ.. ఆ పరిస్థితులను పట్టించుకోకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.

రాష్ట్రంలో ఏర్పడిన నీటి కొరత, విద్యుత్ డిమాండ్ పెరుగుదలకు అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులు కూడా కారణమని గుర్తించకపోవడం బీఆర్ఎస్ నేతల అజ్ఞానమని అన్నారు. ఇక ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, దేవాదాయ శాఖలో పారదర్శకత, ఆలయ ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ఆచరణలోకి వస్తే.. ఒకవైపు ఆలయాలకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉండగా.. మరోవైపు రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలోనూ ఇది కీలకంగా మారే అవకాశం ఉందని వివరించారు. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ముఖ్యమైన ఆలయాల అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే..

#Telangana#Congress#Bhatti Vikramarka#temple lands#Solar plants
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి