National

అభిజీత్ దీప్కే ఆమ‌ర‌ణ దీక్ష‌.. జెన్ జీ క‌దులుతుందా?

రచన: Kashi9 నిమిషాల పఠనం

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నుంచి జెన్ జీ యువ‌త ఏం కోరుకుంటోంది..? ఈ ప్ర‌శ్న‌కు జ‌వాబు వెత‌కాల్సింది సీజేపీ కీ.. మెంబర్సే. సోష‌ల్ మీడియాలో హోరెత్తించిన యూత్.. ప్ర‌జా క్షేత్రంలోకి ఎందుకు రావ‌డం లేదు..? పోరాట‌మే ఊపిరిగా బ‌తికే సామాజిక యోధుడు సోన‌మ్ వాంగ్‌చుక్ చేసిన నిరాహార దీక్ష‌కు ద‌క్కాల్సినంత ఆద‌ర‌ణ ద‌క్కిందా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

కాక్రోచ్ ఉద్య‌మం ఆన్‌లైన్‌కే ప‌రిమిత‌మా..?

జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్‌లేవి..?

సోన‌మ్ వాంగ్‌చుక్ దీక్ష భ‌గ్నం

ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగిన అభిజీత్ దీప్కే

జెన్ జీ యూత్ స్పందిస్తారా..?

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌నే డిమాండ్‌తో మొద‌లైన కాక్రోచ్ ఉద్య‌మం కీల‌క మ‌లుపు తీసుకుంది. 20 రోజులుగా ప్రాణాల‌కు తెగించి పోరాడిన సామాజిక‌వేత్త సోన‌మ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న దీక్ష‌ను భ‌గ్నం చేశారు. ఈ నేప‌థ్యంలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. జులై 20న ర్యాలీ తీసి తీరుతామ‌ని తేల్చిచెప్పారు. జ‌నం జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద‌కు త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు.

జెన్ జీ యూత్ ఎక్క‌డ‌..?

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ అనేదే ఓ సంచ‌ల‌నం. సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లైన ఈ ఉద్య‌మం కొద్ది రోజుల కింద‌ట ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. సోష‌ల్ మీడియా పేజీల‌ను మిలియ‌న్ల కొద్దీ యూత్ ఫాలో అయ్యారు. నినాదాల‌తో సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌ను హోరెత్తించారు. ఇండియాలో జెన్ జీ ఉద్య‌మం మొద‌ల‌వుతుందా అనే దాకా చర్చ వెళ్లింది. కానీ రియాలిటీలో సీన్ మారింది. సోష‌ల్ మీడియాలో హోరెత్తించిన యూత్.. క్షేత్రస్థాయిలో క‌దిలారా అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

అభిజీత్ దీప్కే అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్. అమెరికాలో ఉండి ఆయ‌న వీడియోలు పోస్ట్ చేస్తే మిలియ‌న్ల కొద్దీ జ‌నం చూశారు. ఆయ‌న ఇండియాకు ఎప్పుడొస్తారా అని ఎదురుచూశారు. ఢిల్లీలో అభిజీత్ ఫ్లైట్ దిగిన రోజున ఓ బిగ్ డే గా భావించారు. ఆ రోజున జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగిన మీటింగ్‌కు జ‌నం వెల్లువ‌లా త‌ర‌లివ‌చ్చారు. ఆ త‌ర్వాత దేశ వ్యాప్తంగా మేజ‌ర్ న‌గ‌రాల్లో అభిజీత్ ప‌ర్య‌టించారు. సీజేపీ ఏం చేయాల‌నుకుంటుందో చెప్పారు. కానీ.. రాను రాను ఆయ‌న మీటింగ్‌ల‌కు జ‌నం త‌గ్గార‌నే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ఇంత త్వ‌ర‌గా కాక్రోచ్ ఉద్య‌మానికి ఆద‌ర‌ణ ఎందుకు త‌గ్గింది.

జెన్ జీ ఏం కోరుకుంటున్నారు..?

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నుంచి జెన్ జీ యువ‌త ఏం కోరుకుంటోంది..? ఈ ప్ర‌శ్న‌కు జ‌వాబు వెత‌కాల్సింది సీజేపీ కీ.. మెంబర్సే. సోష‌ల్ మీడియాలో హోరెత్తించిన యూత్.. ప్ర‌జా క్షేత్రంలోకి ఎందుకు రావ‌డం లేదు..? పోరాట‌మే ఊపిరిగా బ‌తికే సామాజిక యోధుడు సోన‌మ్ వాంగ్‌చుక్ చేసిన నిరాహార దీక్ష‌కు ద‌క్కాల్సినంత ఆద‌ర‌ణ ద‌క్కిందా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న దీక్ష భ‌గ్నం చేస్తున్న‌ప్పుడు యువ‌త జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు ఎందుకు త‌ర‌లిరాలేద‌ని ప్ర‌శ్నిస్తున్న వారూ ఉన్నారు. కాక్రోచ్ ఉద్య‌మం కేవలం సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మా..? జెన్ జీ.. జ‌నాల్లోకి వ‌చ్చి పోరాటం చేయ‌రా అని కొంద‌రు గళం విప్పుతున్నారు.

సీజేపీ.. ప్రభుత్వం ముందుంచిన తొలి డిమాండ్.. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా. ఈ డిమాండ్‌కు యూత్ నుంచి స‌రైన స్పంద‌న వ‌చ్చిందా రాలేదా అనే దానిపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నీట్ పేప‌ర్ లీక్ త‌ర్వాత దేశ‌మంతా అట్టుడికి పోయింది. విద్యాశాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌నే డిమాండ్ బాగా వినిపించింది. ఆ అంశాన్నే కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కూడా ఆయుధంగా చేసుకుంది. అయినా ఆశించిన స్థాయిలో స్పంద‌న రాలేద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికి కార‌ణ‌మెవ‌రు..?

మ‌న జెన్‌జీ ఆన్‌లైన్‌కే ప‌రిమితం

నేటి జెన్-జీ యువత సోషల్ మీడియాలో వినూత్న హాష్‌ట్యాగ్‌లు, సరికొత్త పేర్లతో వచ్చే ఉద్యమాలను ఒక ట్రెండ్ లాగా మాత్రమే చూస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. కాక్రోచ్ ఉద్యమానికి లభించిన మిలియన్ల కొద్దీ ఫాలోయింగ్ అనేది కేవలం క్లిక్-బైట్ సంస్కృతిగా కొంద‌రు భావిస్తున్నారు. అస‌లు ఈ ఉద్య‌మం ఎటో వెళుతుంద‌ని చాలా మంది వాదించారు. నేపాల్, శ్రీలంక జెన్ జీ ఉద్య‌మంతో పోల్చి చూశారు. కానీ.. అది సాధ్యం కాలేదు.

బ‌హుషా మ‌న దేశంలో జ‌నాల్లో నుంచి వ‌చ్చిన ఉద్య‌మాలు మాత్ర‌మే నిల‌బ‌డ‌తాయేమో. వాస్త‌వానికి భార‌త ప్ర‌జ‌ల‌కు ఉద్య‌మాలు కొత్తేం కాదు. మ‌న స్వ‌తంత్ర‌మే ఉద్య‌మాల ద్వారా వ‌చ్చింది. ఆ త‌ర్వాత కూడా ఎన్నో విప్ల‌వాలు ఊపిరి పోసుకున్నాయి. కానీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఊపు ఊపిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ మాత్రం క్షేత్ర‌స్థాయిలో అనుకున్నంతగా ఆక‌ట్టుకోలేపోయింద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు సోన‌మ్ వాంగ్‌చుక్ దీక్ష‌ను భ‌గ్నం చేయ‌డంతో.. అభిజీత్ దీప్కే నిర‌స‌న ప్రారంభించారు. మ‌రి ఇప్పుడైనా జెన్ జీ జ‌నం క‌దిలివ‌స్తారా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సీజేపీ కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గానే పిలుపునిస్తోంది. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌కు జ‌నం త‌రలి రావాల‌ని కోరుతోంది. ఈ నేప‌థ్యంలో అభిజీత్ దీప్కే నిరాహార దీక్ష‌, ఈనెల 20న జ‌ర‌గాల్సిన పాద‌యాత్రపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

#Cockroach Janata Party#Abhijith Dipke#Sonam Wangchuk#Jantar Mantar Rally#Gen Z Movement India
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి