Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ చుట్టూ ఇప్పుడు వివాదాలు అల్లుకున్నాయి. నిన్నటివరకు స్టార్ హీరోల పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేయించిన ఆయన, ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఒంటరి అయిపోయే ప్రమాదంలో పడ్డారు. యూనియన్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆయనపై తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
జానీ మాస్టర్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్, ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటిస్తూ షాకింగ్ రూల్ పాస్ చేసింది. అంటే.. ఇకపై దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాకు కొరియోగ్రఫీ చేసినా, మిగిలిన 23 క్రాఫ్ట్‌లకు చెందిన ఏ ఒక్క టెక్నీషియన్ కూడా ఆయనతో కలిసి పని చేయరు. కెమెరామెన్, లైట్ బాయ్స్, ఫైటర్స్, ఆర్ట్ డైరెక్టర్స్.. ఇలా ఎవరూ సహకరించకపోతే ఒక కొరియోగ్రాఫర్ పాటను ఎలా షూట్ చేయగలరు? ఇదే విషయాన్ని ఫెడరేషన్ అధికారికంగా నిర్మాతలకు కూడా తెలియజేయడానికి సిద్ధమైంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జానీ మాస్టర్ తన భార్యకు ఉన్న పదవిని అడ్డం పెట్టుకుని ఇండస్ట్రీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 12న ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, తోటి సభ్యులను రెచ్చగొట్టేలా మాట్లాడిన తీరు ఫెడరేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని యూనియన్ పెద్దలు మండిపడుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నెల 14న విచారణకు పిలిచినా జానీ మాస్టర్ హాజరు కాకపోవడంతో వివాదం మరింత ముదిరింది.
ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ జానీ మాస్టర్‌కు 7 రోజుల గడువు విధిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ లోగా ఆయన తన ప్రవర్తనపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఏడు రోజుల్లో ఆయన నుంచి సరైన సమాధానం రాకపోతే, ఇండస్ట్రీ నుంచి ఆయనను శాశ్వతంగా బహిష్కరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కాగా, ఈ వివాదం ఇలాగే కొనసాగితే జానీ మాస్టర్‌తో సినిమాలు ప్లాన్ చేసుకున్న, లేదా ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న దర్శక-నిర్మాతలకు భారీ నష్టం తప్పదు. ఆయన కోసం కోట్లు ఖర్చు పెట్టి సెట్స్ వేసిన నిర్మాతలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూసే పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ చూపు మొత్తం జానీ మాస్టర్ వైపే ఉంది. మరి ఫెడరేషన్ ఇచ్చిన డెడ్‌లైన్ లోపు ఆయన దిగివచ్చి వివరణ ఇస్తారా? లేక ఈ వివాదాన్ని మరింత పెంచుకుని తన కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకుంటారా? అనేది చూడాలి.












