హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'యువ సంగ్రామ సదస్సు'లో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై నిరుద్యోగ యువత భగ్గుమంది. ఈ సభలో ఆస్మా అనే నిరుద్యోగ యువతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై, కాంగ్రెస్ అగ్ర నేతలపై తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూత్ డిక్లరేషన్ పేరుతో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని ఆమె మండిపడింది.
హామీ ఇచ్చిన ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఆమె ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసింది. రేవంత్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి తాము చాలా పెద్ద తప్పు చేశామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలని ఆమె గట్టిగా డిమాండ్ చేసింది. నిరుద్యోగుల పక్షాన తమ పోరాటం ఇప్పట్లో ఆగదని, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేంత వరకు ప్రభుత్వంతో అలుపెరగని పోరాటం చేస్తామని సదస్సు వేదికగా ఆమె స్పష్టం చేశారు.
గతంలో నిరుద్యోగులు 'ఎండ్రిన్ తాగాలి' అంటూ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆస్మా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎండ్రిన్ తాగాల్సింది నిరుద్యోగులు కాదని, మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రేనని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఊరూరా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పాపానికి ముందుగా రేవంత్ రెడ్డి, ఆ తర్వాత రాహుల్, ప్రియాంక గాంధీలు ఎండ్రిన్ తాగాలని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సభా ప్రాంగణంలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, పలువురు బీఆర్ రాజకీయ ప్రముఖులు ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.












