తమిళనాడు రాజకీయాల్లో సరికొత్తగా అడుగుపెట్టిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లలో అవకతవకలు ఉన్నాయంటూ దాఖలైన ఒక పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు పిలిచింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ విజయ్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ఆదాయపు పన్నుల శాఖ (ఐటీ)లకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల బరిలో నిలిచిన విజయ్ సమర్పించిన ఆస్తుల వివరాల్లో భారీగా పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయని వి.విఘ్నేశ్ అనే పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వేర్వేరు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన పత్రాలలో ఆస్తుల విలువను తప్పుగా చూపించారని పిటిషన్‌లో ఆరోపించారు. విజయ్ తన ఆస్తుల నివేదికలను పారదర్శకంగా వెల్లడించలేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు.
ముఖ్యంగా తిరుచ్చి తూర్పు నియోజకవర్గ అఫిడవిట్‌లో తన చరాస్తుల విలువను రూ.224 కోట్లుగా పేర్కొన్న విజయ్, పెరంబూర్ నియోజకవర్గ అఫిడవిట్‌లో మాత్రం కేవలం రూ.105 కోట్లుగా చూపించారని పిటిషనర్ ఆధారాలతో సహా కోర్టుకు వివరించారు. ఈ రెండు అఫిడవిట్ల మధ్య దాదాపు రూ.100కోట్ల మేర భారీ వ్యత్యాసం ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని సదరు పిటిషన్‌లో పేర్కొన్నారు.
రాజకీయాల్లోకి వస్తూనే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో కలకలం రేపుతోంది. ఈ ఆస్తుల తేడాలపై ఆదాయపు పన్నుల శాఖ, ఎన్నికల సంఘం ఎలాంటి నివేదికలు సమర్పిస్తాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నోటీసులపై విజయ్ చట్టపరంగా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ అఫిడవిట్ల వివాదం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని విశ్లేషకులు భావిస్తున్నారు. పారదర్శకమైన రాజకీయాలు చేస్తానని ప్రకటించిన ఆయన, తొలి అడుగులోనే ఇలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడటం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో విజయ్ లీగల్ టీమ్ ఈ వ్యత్యాసాలపై సరైన వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.












