హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’కు మద్దతుగా నగరవాసులు రోడ్డెక్కారు. వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ నడిబొడ్డున భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన ఈ సంఘీభావ ర్యాలీ.. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల జ్యోతి వరకు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
ఈ భారీ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు "హైడ్రా జిందాబాద్" అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయాలను కొనియాడుతూ ‘జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్’ అంటూ కాలనీ వాసులు ఆకాశమల్లా మార్మోగేలా స్లోగన్స్ ఇచ్చారు. బోడుప్పల్, అనఘారి కాలనీ, మేడిపల్లి టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం, వట్టినాగులపల్లి, జయలక్ష్మి కాలనీలకు చెందిన వందలాది మంది ప్రతినిధులు ఈ యాత్రలో ప్లకార్డులు చేతబూని నడుస్తూ తమ పూర్తి మద్దతును ప్రకటించారు.
గడిచిన రెండు సంవత్సరాల కాలంలో భూకబ్జాదారుల బారి నుండి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను, చెరువులను, పార్కు స్థలాలను హైడ్రా విజయవంతంగా కాపాడిందని కాలనీ సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా కొనియాడారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణ ఎంతైనా అవసరమని, ఇందులో హైడ్రా పోషిస్తున్న పాత్ర చారిత్రాత్మకమైనదని వారు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్య నివారణకు, వరద ముప్పు తప్పించడానికి చెరువుల పునరుద్ధరణ చర్యలు ఇలాగే నిరంతరాయంగా కొనసాగాలని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కాలనీల ప్రతినిధులు మాట్లాడుతూ.. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా హైడ్రా విభాగాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలు, జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్న ఈ వ్యవస్థను చట్టబద్ధంగా మరింత పటిష్టం చేసి, శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడుతున్న ప్రభుత్వానికి తామంతా అండగా ఉంటామని నగరవాసులు ఈ సంఘీభావ యాత్ర ద్వారా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.












