ప్రపంచ చమురు రాజకీయాల్లో కీలక మలుపు తిరుగుతోంది. దశాబ్దాలుగా ప్రపంచ ఇంధన రవాణాకు ప్రధాన ద్వారంగా ఉన్న హర్మూజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇరాక్ భారీ వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అమెరికా దిగ్గజ ఇంధన సంస్థలు చెవ్రాన్, బీపీ, కొనోకోఫిలిప్స్‌లతో కలిసి 60 బిలియన్ డాలర్లకు పైగా విలువైన మెగా ఎనర్జీ ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఈ మెగా ఒప్పందాల నేపథ్యంలో ఇరాక్ తన ఇంధన వ్యూహాన్ని కొత్త దిశలో తీసుకెళ్తోంది. అమెరికా దిగ్గజ సంస్థ చెవ్రాన్ ఇరాక్‌లోని కీలక చమురు క్షేత్రాల అభివృద్ధితో పాటు, సిరియా లేదా టర్కీ మీదుగా మధ్యధరా సముద్రాన్ని చేరుకునే ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే హర్మూజ్ జలసంధిపై ఇరాక్ ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ఇదే సమయంలో బీపీ ఉత్తర ఇరాక్‌లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన కిర్కుక్ చమురు క్షేత్రాల పునరాభివృద్ధికి శ్రీకారం చుడుతుండగా, కొనోకోఫిలిప్స్ 42 శాతం వాటాతో ఈ భారీ ప్రాజెక్టులో భాగస్వామ్యం కానుంది. ఈ పరిణామాలతో ఇరాక్ చమురు ఉత్పత్తి, ఎగుమతి సామర్థ్యం మరింత విస్తరించడమే కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ప్రపంచంలో సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురులో ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి మీదుగానే ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ఇరాక్ దృష్టి పెట్టడంతో ప్రపంచ ఇంధన రంగంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ప్రకటించినవి ప్రాథమిక ఒప్పందాలే. సాంకేతిక అధ్యయనాలు, ప్రభుత్వ అనుమతులు, పెట్టుబడుల తుది ఆమోదం అనంతరమే ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. అయినప్పటికీ ఈ నిర్ణయం మధ్యప్రాచ్య ఇంధన రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో హర్మూజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా చమురు ఎగుమతులు ఆగిపోకుండా చూసే దిశగా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఇరాక్ అనుసరిస్తున్న ఈ వ్యూహం వల్ల భారత్‌కు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.. ఎలాగంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో భారత్ ఒకటి.. కాగా హర్మూజ్ జలసంధిలో తరచుగా ఇబ్బందులు ఎదురవుతుండటం వల్ల ముడి చమురు దిగుమతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుంది.
అందుకే ఇలాంటి ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలు సిద్ధమైతే సరఫరాలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉండటమే కాదు.. అంతర్జాతీయ మార్కెట్ ధరల అస్థిరతలో మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా దీర్ఘకాలం భారత్ వంటి దిగుమతి దేశాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఇంధన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












