అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల పరిధిలోని గొల్లగూడెం సమీపంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. జీవనోపాధి కోసం గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. మరణించిన వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతులను గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకె సుశీల (37), ఊకె లక్ష్మి (37), తుర్రం భారతి (40), భాసుబోయిన బాలరాజు (38), ఊకె రమేశ్ (38)లుగా గుర్తించారు. వీరంతా రోజువారీ పనుల్లో భాగంగానే శనివారం ఉదయం చేపలు పట్టేందుకు గోదావరి నది తీరానికి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
అయితే నదిలో వేట సాగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ ఒకరి తర్వాత ఒకరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన సమీపంలోని ఇతర మత్స్యకారులు, స్థానికులు వెంటనే పోలీసు యంత్రాంగానికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు స్థానిక ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తీవ్ర శ్రమ అనంతరం గల్లంతైన ఐదుగురిని పోలీసులు విగతజీవులుగా నది నుంచి బయటకు తీశారు. తమ వారు ఇక లేరనే విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అకాల మరణం చెందడంతో గొమ్ము కొత్తగూడెం గ్రామం మూగబోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.












