వైరల్ న్యూస్

బాలుడిని చంపిన మొసలిని బంధించిన అధికారులు..

రచన: NK4 నిమిషాల పఠనం

కాళ్లు చేతులు కడుక్కుందామని బాలుడు నదిలోకి దిగాడు. ఇంతలో మొసలి వచ్చి దాడి చేసింది. బాలుడిని తన నోటితో పట్టుకున్న మొసలి.. నదిలోకి తీసుకెళ్లింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రెయిచ్ జిల్లాలో 12ఏళ్ల బాలుడిని మొసలి చంపి తినేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చేతులు, కాళ్లు కడుక్కునేందుకు బాలుడు నదిలోకి దిగగా.. అనూహ్యంగా మొసలి దాడి చేసింది. బాలుడిని నీళ్లలోకి లాకెళ్లింది. అందరూ చూస్తుండగానే బాలుడిని చంపి తినేసింది. కాగా, బాలుడిని బలిగొన్న మొసలిని అటవీ శాఖ సిబ్బంది బంధించారు. స్థానిక ప్రజల సహకారంతో ఆ మొసలిని తాళ్లతో బంధించారు. ఆ మొసలిని సురక్షితంగా మరొక నదికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఘఘరా (సరయూ) నదీ తీరంలో చేతులు, కాళ్లు కడుక్కుంటున్న ఆ అమాయక బాలుడిని ఆ క్రూరమైన మొసలి లాక్కెళ్లి చంపేయడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

బాలుడు తన బాబాయ్ తో కలిసి పొలానికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కాళ్లు చేతులు కడుక్కుందామని బాలుడు నదిలోకి దిగాడు. ఇంతలో మొసలి వచ్చి దాడి చేసింది. బాలుడిని తన నోటితో పట్టుకున్న మొసలి.. నదిలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత అతడిని పలుమార్లు విసిరికొట్టింది. అనంతరం నడుము కింది భాగం వరకు తినేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలుడిని సునీల్ సింగ్ గా గుర్తించారు. వరి నాట్లు వేసే పని కోసం అతడు తన మామతో కలిసి పొలానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్లే ముందు చేతులు ముఖం కడుక్కోవడానికి ఘఘరా నది వద్దకు వెళ్లగా, నీటిలోంచి అకస్మాత్తుగా బయటకు వచ్చిన మొసలి అతనిపై దాడి చేసి చంపింది.

అక్కడే ఉన్న సునీల్ మామయ్య, గ్రామస్తులు బాలుడిని రక్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. బాలుడిని బయటకు లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ జంతువు అతన్ని మరింత లోతైన నీటిలోకి లాగివేసింది. "నేను నదిలోకి దూకి సునీల్ చేతిని పట్టుకోగలిగాను. అతన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ దాదాపు ఏడు నిమిషాల పాటు నదిలోనే ఉండిపోయాను. కానీ ఆ మొసలి చాలా శక్తివంతమైనది కావడంతో అతన్ని లోతైన నీటిలోకి లాక్కెళ్లింది. నేను సునీల్ ని కాపాడలేకపోయాను" అని అతని మామ విజయ్ రాజ్ సింగ్ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆరవ తరగతి చదువుతున్న సునీల్ తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ముగ్గురు సోదరీమణుల మధ్య అతనొక్కడే సోదరుడు. తల్లిదండ్రులు లేకపోవడంతో మామ దగ్గర ఉంటున్నాడు.

ఈ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడొచ్చు..

https://x.com/NatureChapter/status/2078389043964825715

https://x.com/upuknews1/status/2078330820042105289

#Crocodile#Attack#Eat#Uttar Pradesh#Bahraich#Ghaghara River
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి