కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూపు విభేదాలు బహిర్గతం అవుతున్నాయా? తెలంగాణ కాంగ్రెస్‌లో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే అదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్గత విభేదాలు తగ్గుతాయని భావించినా, నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
కొండ సురేఖా, కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం కాస్త మరుగున పడిందని అనుకున్న సమయంలో మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. దండేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చింపివేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గ్రామ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించారని ఆగ్రహిస్తూ.. మరో వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న కొందరు కార్యకర్తలు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు.
దీంతో రెండు వర్గాల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ తోపులాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఘటనతో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లేకపోవడం, స్థానిక నాయకత్వాన్ని విస్మరించడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు కొత్తేం కాదని ఎన్నోసార్లు నిరూపించబడింది.
ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జానారెడ్డి వర్గాల మధ్య విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ఉద్యమం తర్వాత పీసీసీ అధ్యక్ష పదవుల విషయంలో పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి వర్గాల మధ్య అంతర్గత పోటీ నెలకొందనే ప్రచారం జరిగింది. ఇటీవల కూడా కొందరు మంత్రులు, సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపంపై వార్తలు రావడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
అలాగే గాంధీభవన్ సాక్షిగా కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అధికారంలో ఉన్నప్పుడు పదవులు, ప్రాధాన్యత వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు సహజమే. అయితే అవి బహిరంగ విమర్శల స్థాయికి వెళితే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సవాళ్ల దృష్ట్యా కాంగ్రెస్ అధిష్టానం ఈ విభేదాలను ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ గ్రూపు రాజకీయాలు ఊపందుకుంటున్నాయా? లేక ఇవి తాత్కాలిక అసంతృప్తులేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..












