తెలంగాణలో చాలారోజుల తర్వాత ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ కె. లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ సమావేశం సాధారణ మర్యాదపూర్వక భేటీగా కనిపించినా, దాని వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ బీజేపీలో గత కొంతకాలంగా నాయకత్వం, పార్టీ భవిష్యత్ వ్యూహాలు, రాష్ట్ర రాజకీయాలపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య రాజకీయ దూరం పెరిగిందనే ప్రచారం చాలాకాలంగా కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు తర్వాత కూడా ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.
దీంతో ఇద్దరి మధ్య వైరం ఉందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనూ బలపడింది. అయితే ఇప్పుడు లక్ష్మణ్ నివాసంలో వీరిద్దరూ నవ్వుతూ పలకరించుకోవడం కనిపించింది. సాధారణంగా పొలిటీషియన్స్ కు రాజకీయంగా విభేధాలు ఉంటాయి కానీ పర్సనల్ గొడవలు అంటూ ఏమి ఉండవని నేతలు ఎన్నో సార్లు నిరూపించారు కూడా.. ఇక ఇప్పుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకే చోట సరదాగా ఉన్నట్టు కనిపించడం పై పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ భేటీ వీరిపై జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే ప్రయత్నమా? లేక రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతమా? అనే చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది. బీజేపీ తన బలాన్ని తిరిగి పెంచుకోవాల్సిన అవసరం తెలంగాణలో ఎంతో ఉంది. ఈ సమయంలో కీలక నాయకులు ఐక్యతను ప్రదర్శించడం పార్టీకి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే అంతర్గత విభేదాలకు ముగింపు పలకాల్సిందేనని పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈటల రాజేందర్, బండి సంజయ్ భేటీ కేవలం మర్యాదపూర్వక సమావేశమా? లేక తెలంగాణ బీజేపీలో కొత్త సమీకరణాలకు నాంది పలికే రాజకీయ సందేశమా? అన్నదాని పై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత రానుందని తెలుస్తుంది.












