తెలంగాణ

మీది పేపర్ లీకుల పాలన.. మాది కొలువుల జాతర- కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి కౌంటర్

రచన: NK6 నిమిషాల పఠనం

మీ హయాంలో నిరుద్యోగుల చేతిలో హాల్‌ టికెట్ ఉండేది. మా ప్రజా ప్రభుత్వంలో అపాయింట్ మెంట్ లెటర్ ఉంది. అదే తేడా. మీరు జిరాక్స్ సెంటర్ల దగ్గర పేపర్లు అమ్ముకునే పరిస్థితి తెచ్చారు, మేము శిల్పకళా వేదికపై, ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ పత్రాలు పంచాము.

Adluri Laxman Kumar: యువ సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. యువ సంగ్రామ సదస్సులో నిరుద్యోగ యువత లేరని.. పెయిడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. మీ పాపాల చిట్టా చాలా పెద్దగా ఉంది అంటూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.

"కేటీఆర్ కబుర్లు కాదు ప్రభుత్వ రికార్డులు మాట్లాడుతున్నయ్. మీది పేపర్ లీకుల పాలన. మాది కొలువుల జాతర. మీ హయాంలో నిరుద్యోగుల చేతిలో హాల్‌ టికెట్ ఉండేది. మా ప్రజా ప్రభుత్వంలో అపాయింట్ మెంట్ లెటర్ ఉంది. అదే తేడా. మీరు జిరాక్స్ సెంటర్ల దగ్గర పేపర్లు అమ్ముకునే పరిస్థితి తెచ్చారు, మేము శిల్పకళా వేదికపై, ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ పత్రాలు పంచాము. "కొలువుల కుంభమేళా ఎక్కడ?" అంటున్నారు. రెండేళ్లలో 67వేల 763 మందికి ఉద్యోగాలు ఇచ్చిన రికార్డ్ మీ కళ్ల ముందే ఉంది. ఇంకా 13,197 పోస్టుల భర్తీ చివరి దశలో ఉంది. మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. దశల వారీగా ఉద్యోగాలు ఇస్తోంది.

టీజీపీఎస్సీని మీరు అపకీర్తి పాలు చేశారు. మేము ప్రక్షాళన చేసి మళ్లీ యువత నమ్మకం గెలుచుకున్నాం. గ్రూప్-1 రద్దయిన పరీక్షను మళ్లీ నిర్వహించి 562 పోస్టులు భర్తీ చేశాం. గ్రూప్-2లో 783 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. గ్రూప్-3లో 1,370 పోస్టులు భర్తీ చేశాం. గ్రూప్-4లో 8,143 మంది జీవితాల్లో వెలుగులు నింపాం. టీజీపీఎస్సీ ద్వారానే మొత్తం 17,326 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది ప్రచారం కాదు అధికారిక రికార్డ్.

మెగా డీఎస్సీ అంటూ మాటలు కాదు 10,006 మంది కొత్త టీచర్లను పాఠశాలలకు పంపాం. గురుకులాల్లో 8,400 మంది ఉపాధ్యాయులను నియమించి వేలాది పేద పిల్లల భవిష్యత్తును బలోపేతం చేశాం. పోలీస్ శాఖలో 16,067 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు మరో 7,437 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆరోగ్య శాఖలో 8,822 ఉద్యోగాలు భర్తీ చేశాం. నిమ్స్‌లో 643, టిమ్స్‌లో 6,278 పోస్టులకు కేబినెట్ లో ఆమోదం ఇచ్చాం. రెవెన్యూ, విద్యుత్, సింగరేణి, ఆరోగ్యం, గురుకులాలు... ఏ శాఖ చూసినా నియామకాల జోరు కనిపిస్తోంది.

అంగన్‌వాడీల్లో 15,982 పోస్టులు, పోలీస్ శాఖలో 7,437 పోస్టులు, టిమ్స్‌లో 6,278 పోస్టులు.. వరుస నోటిఫికేషన్లే మా జవాబు. వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచి పదేళ్ల ఊరట ఇచ్చింది ఈ ప్రజా ప్రభుత్వమే. మీరు యువతకు ఇచ్చింది నిరాశ. మా ప్రభుత్వం ఇచ్చింది ఉద్యోగ భరోసా. కోర్టుల్లో ఆగిపోయిన నియామకాలు మేం పూర్తి చేశాం.

కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చింది మాత్రం మీ ప్రభుత్వమే. నోటిఫికేషన్ ఇచ్చి మర్చిపోయే ప్రభుత్వం మాది కాదు. పరీక్షలు పెట్టి, ఫలితాలు ఇచ్చి, ఉద్యోగ పత్రాలు అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగి ఇంట్లో దీపం వెలిగింది. బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఆశలు ఆరిపోయాయి. కేటీఆర్.. వేదికల మీద ఉపన్యాసాలు ఆపి, ముందు పేపర్ లీకేజీలకు యువతకు క్షమాపణ చెప్పండి. ఉద్యోగం అంటే ప్రకటన కాదు నియామక పత్రం. ఆ నియామక పత్రం అందించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం'' అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

#Adluri Laxman Kumar#Brs#Congress#Telangana#Jobs#Ktr#Government Jobs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి