CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాయి అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
''అందెశ్రీ నాకు ఒక ఆత్మ బంధువు. తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారు. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారు. అందెశ్రీ పాటలు తూటాలై, మరపిరంగులై గడీలను బద్దలు కొట్టాయి. ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడటానికి అందెశ్రీ నాకు స్ఫూర్తి. ఇటుకపై ఇటుక పేర్చిన తాపీ మేస్త్రి.. అక్షరాలపై అక్షరాలని పేర్చి ఉద్యమ గీతాలు రాశారు. ప్రజల్లో చైతన్యం నింపారు. ఆయన పాట మన గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపింది. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. కానీ గత పదేళ్లలో కుట్రలతో ఆయన పాటను వినిపించకుండా చేశారు. పెన్నులపై మన్ను కప్పితే గనులై మొలకెత్తుతాయని అన్నట్లుగా.. ఇప్పుడు తెలంగాణ ప్రతీ బడిలో, ప్రతీ గడపలో ఆయన పాట వినిపిస్తోంది.
ఆత్మగౌరవంతో ఆయన ఏనాడు దొరల గడప తొక్కలేదు. తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప… గడీలలో దొరల కోసం కాదని అందెశ్రీ నిటారుగా నిలబడ్డారు. మనందరం దండు కట్టి విష సర్పాలను తుద ముట్టించాలని ఆయన అన్న మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి. నా కుటుంబంలో పెద్దన్నగా అందెశ్రీని భావించా. ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో.. గద్దరన్నను అవమానించారో… ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారు.
పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు
మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఈ తోడేళ్ల గుంపును నేను ప్రశ్నిస్తున్నా. ఆనాడు మీ కుటుంబాల్లోని కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే 3 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చావు కదా? మరి నిరుద్యోగ తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా? మేం నోటిఫికేషన్లు ఇచ్చాం, రేవంత్ రెడ్డి భర్తీ చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప.. పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం ఏనాడైనా ఆలోచించిందా?
తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూశాం
నిరుద్యోగుల పట్ల మీరెప్పుడైనా మనుషుల్లా ప్రవర్తించారా? మానవీయ కోణంలో చూశారా? మేం అధికారంలోకి వచ్చాక అడ్డంకులను తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పకళా వేదిక సాక్షిగా తల్లిదండ్రుల ముందు ఆ బిడ్డలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. ఆ తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూశాం. పదేళ్లు మీరు నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? ఏడాదిలో 70 వేల ఉద్యోగాలు మేం ఎలా భర్తీ చేశాం.
దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ ను ముఖ్యమంత్రిని చేసింది
మీరు శ్రీమంతులు ఎలా అయ్యారు? తెలంగాణ అప్పుల్లో ఎలా కూరుకుపోయింది? మేక తోలు కప్పుకున్న తోడేళ్లను నేను అడుగుతున్నా. గజ్వేల్ లో మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే బాధ్యత మా యువకులు చూసుకుంటారు. తెలంగాణ సమాజం మీకు ఏం తక్కువ చేసింది. దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ ను ముఖ్యమంత్రిని చేసింది. అమెరికాలో బాత్ రూమ్ లు కడిగే ఆయన కొడుకును మంత్రిని చేసింది. రబ్బరు చెప్పులతో తిరిగిన వాళ్లను, సోడా పోసినోళ్లని మంత్రులను చేసింది.
తులసి వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వం
నేను ఉన్నంత వరకు ఈ తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వం. మాకు అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ స్ఫూర్తి. మీకు ఎవరు స్ఫూర్తి? నిజాం, ఖాసీం రిజ్వీనా మీకు స్ఫూర్తి? నీకు మాకు పోలిక ఎంది.. పోటీ ఏంది? మీ దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోంది. నిజాంను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డది. తెలంగాణ చైతన్యం ముందు మీరెంత.. మళ్లీ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. తెలంగాణను ఎవరూ చెరబట్టలేరు. చెర బట్టాలని చూస్తే అందెశ్రీ పాటగా తిరిగి వస్తారు. మా ప్రభుత్వం అందెశ్రీ స్ఫూర్తితో పనిచేస్తోంది.
నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దు. ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందిస్తుంది. పదేళ్లు బిడ్డ కవితకు పదవి ఇచ్చుకున్నారు. కానీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీకు గుర్తుకు రాలేదా? మా ప్రభుత్వంలో శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాం.
చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాం. కోదండరాంను ఎమ్మెల్సీ చేసుకున్నాం. 9 మంది కవులను సన్మానించి కోటి రూపాయల నగదు బహుమతి ఇచ్చి గౌరవించుకున్నాం.
2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం
ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి…? మీ కుటుంబం దోచుకునేందుకా? మీ కుటుంబం పదవుల కోసమా? మీరు మీ కుటుంబ సభ్యులు రికార్డు చేసుకోండి.. రోజూ వినండి. 2034 వరకు ప్రజా ప్రభుత్వానిదే అధికారం. ఇదే భవిష్యత్, ఇదే చరిత్ర. మీకు గతమే తప్ప భవిష్యత్ లేదు'' అంటూ నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.












