హిందూధర్మంలో సాధారణంగా అందరూ ఆచరించే నియమం పూజ చేయడం.. హిందువుగా పుట్టిన ప్రతి వారు రోజు పూజ చేయకపోయినా.. వారంలో ఏదో ఒకరోజు మాత్రం తప్పక ఈ విధానాన్ని ఆచరించడం తెలిసిందే. మరి పూజా అంటే ఏమిటో మనలో ఎంత మందికి తెలుసు?.. ఈ పదానికి సంస్కృతంలో గౌరవించడం, సత్కరించడం, ఆరాధించడం అనే అర్థాలు ఉన్నాయి.
అదేవిధంగా ఒక దేవి, దేవత పట్ల మన హృదయంలో గల గౌరవ పూర్వకమైన ప్రేమను అభివ్యక్తం చేసే విధానం పేరే పూజ అని అంటారని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ పూజలో సకామ పూజ, (కోరికలతో కూడిన పూజ).. నిష్కామ పూజ (కోరికలు లేని పూజ) అని రెండు రకాలు ఉంటాయని చెబుతున్నారు. భగవద్గీత, పురాణాల ప్రకారం, ఒక వ్యక్తి చేసే పూజ లేదా భక్తి అనేది వారి మానసిక స్థితిని బట్టి, వారు పూజించే విధానాన్ని బట్టి వర్గీకరించబడింది.
మరోవైపు ఈ పూజల్లో తామసికము, రాజసికము, సాత్వికము మానసికము అని నాలుగు రకాలు ఉన్నాయి.. వీటిలో తామసిక, రాజసిక, సాత్విక పూజలు అనేవి మనిషి యొక్క గుణాలను బట్టి చేసే పూజలు. మానసిక పూజ అనేది బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం అంతరంగంలో చేసే ఉన్నతమైన సాధనా విధానం. ఇక సాధారణంగా భక్తులు దేవుడిని ధ్యానించడం, పుష్పాలు సమర్పించడం, దీపం వెలిగించడం, ధూపం వేయడం, నైవేద్యం సమర్పించడం, మంత్రాలు లేదా స్తోత్రాలు పఠించడం వంటివి చేస్తారు.
కాగా వీటిలో సాత్విక, నిష్కామ పూజ ఉత్తమోత్తమమని పండితులు అంటున్నారు.. ఇక ఈ సృష్టిలో భగవంతుడు ఒక్కడే అని.. కానీ మత విశ్వాసాలను బట్టి, మనుషుల అభిరుచికి తగ్గట్టుగా ఆ ఏకేశ్వరుడే అనేక రూపాలను పొందుతున్నాడనే విశ్వాసం ఉంది. అందువలన ఏ దేవతను తీసుకున్నా సత్యస్థితిలో ఆ దేవత ఆదిపరమాత్మ యొక్క రూపాంతరమే గనుక అది సర్వశక్తిమంతము, సర్వవ్యాపకము, సర్వాధికము అయి తీరుతుంది.
అందువల్ల ఎవరు ఏ దేవతను ఉపాసించినా ఈ రకమైన భావనతోనే ఉపాసించాలని.. సులభసిద్ధికి ఇదే మార్గం అని పురాణాలు, పండితులు చెప్పడం కనిపిస్తుంది. ఇక సాధారణంగా మనుషులు ప్రాథమిక దశలో 'సకామ పూజ'తోనే భక్తి మార్గాన్ని ప్రారంభిస్తారు. కానీ, ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ కోరికలు తగ్గి, పూజ 'నిష్కామ పూజ'గా మారుతుంది. హిందూ ధర్మంలో నిష్కామ పూజను అత్యున్నతమైనదిగా హిందువులు భావిస్తారు.












