టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా 1600,140 సిరీస్ల నుంచి వచ్చే కాల్స్పై క్లారిటీ ఇచ్చింది. స్పామ్ డిటెక్షన్ అప్లికేషన్‌లు, కాల్ ఫిల్టరింగ్ ఇకపై ఈ నంబర్లను స్పామ్ లేదా మోసపూరితమైనవిగా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయవు లేదా లేబుల్ చేయవని తెలిపింది.
బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, అలాగే వ్యాపార సంస్థల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారాలు అనవసర అంతరాయాలు లేకుండా వినియోగదారులకు చేరేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ ఈ సందర్భంగా తెలిపింది.
అదేవిధంగా అత్యవసర సేవలకు సంబంధించిన కమ్యూనికేషన్ కోసం 1600 నంబర్ సిరీస్ ని ప్రత్యేకంగా కేటాయించినట్లు పేర్కొన్న ట్రాయ్.. బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలోని పలు ముఖ్య శాఖలు ఈ సిరీస్ నుంచి కాల్స్ చేస్తాయని తెలిపింది.
ఈ నంబర్ ద్వారానే అత్యవసర అకౌంట్ అలర్ట్‌లు, OTPలు, పాలసీ అప్‌డేట్‌లు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారని ట్రాయ్ వివరణ ఇచ్చింది. మరోవైపు స్పామ్ డిటెక్షన్ యాప్‌లు ఈ కాల్స్‌ను బ్లాక్ చేస్తుండటం వల్ల చాలా మంది వీటిని మిస్ అవుతున్నారని పేర్కొంది.
అలాగే 140 సిరీస్ నుంచి కూడా కేవలం రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల కాల్స్ వస్తాయని.. ఇవి స్పామ్ కాల్స్ అని పొరబడవద్దని ట్రాయ్ సూచించింది. అవి ప్రకటనలే అయినప్పటికీ టెలికాం నిబంధనలను పాటిస్తున్నారని.. అందువల్ల ఇకపై యాప్‌లు వాటంతట అవే వాటిని పూర్తిగా నిషేధించలేవు లేదా స్పామ్‌గా గుర్తించలేవని ట్రాయ్ పేర్కొంది.
అలాగే కస్టమర్లు మార్కెటింగ్ కాల్స్‌తో విసిగిపోయి ఉంటే స్పామ్ యాప్‌లను వాడటం మానేసి, ఆయా నెట్ వర్క్ ఆపరేటర్‌తో గానీ లేదా TRAI DND యాప్ ద్వారా గానీ 'డు నాట్ డిస్టర్బ్' ను యాక్టివేట్ చేసుకోవాలని ట్రాయ్ వినియోగదారులకు సూచింది..












