ఇది దేశంలోనే తొలిసారి. ఇకపై వంట గ్యాస్ సిలిండర్లను ఇంటి వద్దకే డెలివరీ చేస్తుంది స్విగ్గీ. ఏంటి నమ్మబుద్ది కావడం లేదా. కానీ ఇది నిజం. ప్రముఖ ఇ కామర్స్ సంస్థ స్విగ్గీ మరో అడుగు ముందు కేసింది. ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సర్వీస్ ను ప్రారంభించింది. ఈ మేరకు ప్రముఖ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో (హెచ్ పీసీఎల్) జతకట్టింది. ఈ మేరకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు స్విగ్గీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ ప్రకటించాయి.
ఒక క్విక్-కామర్స్ యాప్ ద్వారా ఇటువంటి సర్వీస్ రావడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ క్విక్ కామర్స్ సిలిండర్ డెలివరీ సేవలు ముందుగా బెంగళూరులో అందుబాటులోకి రానున్నాయి. ఇన్ స్టా మార్ట్ యాప్ ద్వారా వినియోగదారులు 10కేజీల హెచ్ పీ నవ్య, 5 కేజీల సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు దీనికి ఎల్ పీజీ కనెక్షన్ ఉండాల్సిన అవసరమే లేదు. అయితే మొదటిసారి ఆర్డర్ చేసినప్పుడు మాత్రం సిలిండర్ కొనుగోలుకు కావాల్సిన వెరిఫికేషన్ అవసరం. దాని ఆధారంగా నిమిషాల్లో డెలివరీ చేస్తారు. తొలి ఆర్డర్ కు కొత్త సిలిండర్లు ఇస్తారు. ఆ తర్వాత ఖాళీ సిలిండర్ ను ఇచ్చి రీఫిల్స్ తీసుకోవచ్చు.
భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎల్‌పీజీ వినియోగదారుగా ఉంది. ఇక్కడ వంట గ్యాస్‌ను ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సరఫరా చేస్తాయి. ఇప్పటికే తాజా ఉత్పత్తులు, స్నాక్స్ నుండి ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వరకు అన్నింటినీ డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. ఇప్పుడు LPG సిలిండర్లను కూడా డెలివరీ చేయనుంది.
వంట గ్యాస్ సిలిండర్లను వినియోగదారుల ఇంటి వద్దకే చేరవేసేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు స్విగ్గీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించాయి. 'క్విక్-కామర్స్' యాప్ ద్వారా ఇటువంటి డెలివరీ సేవను అందించడం దేశంలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన కొన్ని నెలల తర్వాత ఈ సేవ ప్రారంభమవుతోంది. సాధారణంగా లభించే 14.2 కిలోల సిలిండర్లకు భిన్నంగా, ఇందులో భాగంగా మొదట 5 కిలోలు, 10 కిలోల పరిమాణం కలిగిన చిన్న సిలిండర్లను ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని ఆయా కంపెనీలు తెలిపాయి. అయితే, వీటి ధరల వివరాలను మాత్రం వెల్లడించలేదు.












