వైరల్ న్యూస్

ఈ జలపాతం సొగసు చూడతరమా!..

రచన: Venu4 నిమిషాల పఠనం

అదిలాబాద్‌ జిల్లా అంటేనే... దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అడవితల్లి బిడ్డల ఆనవాళ్ళు.. ఈ జిల్లాలో సహజ సిద్దంగా ఏర్పడిన జలపాతాలను చూస్తుంటే మనసు పరవశించిపోతుంది.

అదిలాబాద్‌ జిల్లా అంటేనే... దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అడవితల్లి బిడ్డల ఆనవాళ్ళు.. ఈ జిల్లాలో సహజ సిద్దంగా ఏర్పడిన జలపాతాలను చూస్తుంటే మనసు పరవశించిపోతుంది. అలాంటి వాటిల బోథ్ నియోజకవర్గ పరిధిలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ జలపాతం ఒకటి.. పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోన్న ఈ జలపాతం సోయగాలు ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు.

ఆదిలాబాద్ నుండి 47 కి.మీ దూరంలో, జాతీయ రహదారికి 6 కి.మీ దూరంలో, నిర్మల్ పట్టణానికి 37 కి.మీ దూరంలో పొచ్చెర జలపాతం ఉంది. మనసుకు ఆహ్లాదాన్ని పంచే ఇక్కడి ప్రకృతి అందాలను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవనిపిస్తుంది.

చుట్టూ చిన్న చిన్న కొండలు, నల్లని రాకాసి రాళ్ల మధ్య నుంచి ఎగసి పడుతూ జాలువారే జలాలను చూస్తుంటే దివి నుంచి భువికి దిగివస్తున్న జల కన్యలా కనిపిస్తాయి. ఈ జలపాతం అందాలను సందర్శించే పర్యాటకుల మదిలో మధుర జ్ఞాపకాలు జీవిత కాలం నిలిచిపోతాయనడంలో సందేహం లేదు..

ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు సెలవు దినాలలో, వారాంతాలలో ఎక్కువగా వస్తుంటారు. అటవీ శాఖ సామాజిక వన విభాగం అదనపు సొబగులు అద్దుతూ జలపాతం వద్ద ప్రహరీ గోడ నిర్మించారు. ఈ ప్రదేశంలో వివిధ రకాలైన మొక్కలను పెంచడమే కాకుండా వనదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

జలపాతం వద్దకు రోడ్డు వేయడంతో పాటు, విద్యుత్‌ సౌకర్యం కల్పించి పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా చేశారు. ఈ జలపాతం పక్కనే పార్కు కూడా ఉంది. కొండకోనల మధ్య నుండి నీళ్లు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు పడుతున్నదృశ్యం ఆహ్లదకరంగా ఉంటుంది.

చిన్న చిన్న కొండవాగు రాళ్ల నుంచి ఎగసిపడే ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని సినిమాల షూటింగులు జరగడం విశేషం.. మరోవైపు పొచ్చెర జలపాతం ఇతర జలపాతాల కన్న భిన్నమైంది. దట్టమైన అరణ్యం అంతర్భాగంలో జలపాతం ఉండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.

పొచ్చెర జలపాతాలకు పవిత్ర గోదావరీ నదీ ప్రవాహించే సహ్యాద్రి పర్యతశ్రేణి నుంచి నీరు వస్తుంది. ఇలా అనేక పాయలుగా ప్రవహిస్తున్న నీరు చివరకు ఈ ప్రాంతంలో కలసి.. 20 మీటర్ల ఎత్తు నుండి జలపాతంలోకి దూకుతూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రవాహం తన ప్రయాణాన్ని కుంటాల జలపాతానికి కొనసాగిస్తుంది.

ప్రస్తుతం మనిషి యంత్రంలా మారిపోయాడు.. అలాంటి జీవితం నుండి ప్రకృతి ఒడిలో సేద తీరితే కలిగే ఆనందమే వేరు.. పచ్చని ప్రకృతిని చూసినప్పుడు.. మనసు పలికే బాష ఊహాతీతం. అంతటి అందమైన ప్రకృతి ప్రసాదించిన ప్రశాంతతో.. అలసట లేకుండా మిగతా రోజులు హుషారుగా పనిలో మునిగిపోవచ్చు..

#Pochera Waterfall#Boath constituency#Adilabad district#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి