కలియుగ వైకుంఠంగా భక్తుల చేత పూజలందుకుంటున్న పవిత్ర క్షేత్రం.. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తూ కొలువై ఉన్న దివ్యధామం తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం.. నిత్యం ఆ వెంకట నాధుడు దర్శనానికి లక్షల్లో భక్తులు వెళ్ళడం తెలిసిందే..
ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. తితిదే ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. బుధవారం నుంచి దాతల ప్రివిలేజెస్ విధానంలో తితిదే మార్పులు తీసుకురానున్న నేపథ్యంలో దాతలు ఒక్కసారిగా పోటెత్తారు.
దీంతో మంగళవారం ఒక్కరోజే ఏకంగా రూ.96.98 కోట్ల విరాళాలు సమకూరినట్టు ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. అయితే ఈ మార్పులు ఇంతకు ముందు విరాళాలు అందించిన వారికి వర్తించవని, వారికి పాత విధానం ప్రకారమే సదుపాయాలు కొనసాగిస్తామని తితిదే ప్రకటించడంతో దాతలు భారీగా విరాళాలు సమర్పించారట..
ఇక కేవలం ఒక్కరోజే 2,460 మంది విరాళాలు సమర్పించారని, వీరిలో అత్యధికంగా ఆన్‌లైన్ ద్వారా 2,354 మంది, ఆఫ్‌లైన్ ద్వారా 106 మంది విరాళాలు అందజేసినట్టు తితిదే తెలిపింది. అలాగే రూ.లక్ష నుంచి రూ.10 లక్షలలోపు 1,212 మంది విరాళం అందించగా.. 1,246 మంది భక్తులు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు విరాళం ఇచ్చినట్టు పేర్కొంది.
మరోవైపు రూ.కోటి అంతకంటే పైగా ఇద్దరు అందించారని వివరించింది. ఇక భవిష్యత్తులో సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దాతల ప్రివిలేజ్ విధానంలో కీలక మార్పులు చేపట్టింది.
ఈ క్రమంలో దాతలకు ఇప్పటివరకు అందిస్తున్న కొన్ని ప్రత్యేక సదుపాయాలను పరిమితం చేస్తూ బుధవారం నుంచి కొత్త పాలసీ అమలులోకి తీసుకువచ్చింది. ఇక తితిదే గణాంకాల ప్రకారం, జూన్ 26 నాటికి మొత్తం 1,97,888 మంది దాతలు నమోదు అయ్యారు.
వీరిలో సుమారు 1.5 లక్షల మంది రూ.1 లక్ష విరాళం అందించిన దాతలు కాగా, రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన దాతల సంఖ్య దాదాపు 22 వేల వరకు ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే వెల్లడించింది.












