తెలంగాణలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు "తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్" కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కిట్‌లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పలు ఉపయోగకరమైన వస్తువులు ఉండనున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు వాటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కిట్‌లోని వస్తువుల నాణ్యతపై విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సాంకేతిక వేదికల ద్వారా సేకరించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, గతంలో ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. చాలా కాలంగా ప్రభుత్వ పాఠశాలలు తగిన ప్రాధాన్యం పొందకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతులు బలహీనపడటం వల్ల పేద కుటుంబాల పిల్లలపై ఎక్కువ ప్రభావం పడిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్న సీఎం.. రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని, అందుకే విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటునట్టు వెల్లడించారు.
ఇందులో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సహకారంతో విరాళాలు సేకరించి రూ.1.77 కోట్లతో నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన ఆయన.. నేటి సమాజంలో చదువు వ్యక్తిగత జీవితానికే కాదు, సమాజ పురోగతికి కూడా బలమైన పునాది అని.. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. తన ఆసక్తికి అనుగుణంగా ప్రతి విద్యార్థి ఎదగాలని, ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా నాణ్యత రెండూ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని పేర్కొన్న సిఎం.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, బదిలీల అంశాలను పరిష్కరించామని తెలిపారు. ఉపాధ్యాయులు సంతృప్తిగా ఉంటేనే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని అన్నారు.
అలాగే, ప్రపంచ స్థాయి విద్యా విధానాలపై అవగాహన పెంచేందుకు ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యలు స్పష్టమైన ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో వైపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల మంది టీచర్ల బదిలీ జరిగినట్టు సిఎం తెలిపారు. అలాగే 317 జీవోతో ఎక్కడెక్కడో విధులు నిర్వహిస్తున్న కుటుంబాలను ఒక్కచోటికి చేర్చినట్టు వివరించారు. ఇక విద్యాశాఖపై కేంద్రం విడుదల చేసిన నివేదికల్లో గతంలో రాష్ట్రం చివరన ఉండేది. ప్రస్తుతం 18వ స్థానానికి చేరుకుందని అన్నారు.
అదేవిధంగా ప్రపంచ విద్యా వ్యవస్థపై అవగాహన కోసం గత ఏడాది 50 మంది టీచర్లను విదేశాలకు పంపినట్టు.. ఈ ఏడాది మరో 150 మందిని పంపడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు.. అలాగే ప్రతిభావంతులైన టీచర్లకు రాష్ట్ర అవతరణ రోజున అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.












