రైతులకు పెట్టుబడి ఖర్చులను తగ్గించి, చీడపీడలను నియంత్రించి, మేలైన దిగుబడిని అందించే విషయంలో సలహాలు ఇవ్వడానికి మాత్రమే స్థాపించిన సంస్థ.. తిరుపతిలోని చీనీ నిమ్మ పరిశోధన సంస్థ.. కానీ ఇప్పుడు ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు ముప్పాతిక శాతం మొక్కలను ఇచ్చి, రైతులకు అండగా నిలుస్తుంది..
చీని నిమ్మ రైతులకు సలహాలు ఇచ్చే కేంద్రంగా తిరుపతిలో 1968లో ప్రారంభమైన చీనీ నిమ్మ పరిశోధన కేంద్రం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో రైతులకు సలహాలు ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఏపి, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక చీని నిమ్మ రైతులకు అవసరమైన సహాయ సహాకారాలు అందిస్తూ... సుమారు 60 సంవత్సరాలుగా రైతుల సేవలో కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో చీనీ నిమ్మ ఎక్కువగా సాగువుతుంది. అదే విధంగా తెలంగాణలో నల్గొండ, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, యాదాద్రి భువనగిరి జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, జిల్లాల్లో ఈ తోటలు విస్తరించి ఉన్నాయి.
ఇక ఈ పరిశోధన సంస్థ 46 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న చీని రకాలతో పాటు నిమ్మ రకాలను పెంచుతున్నారు. అయితే ఈ ప్రాంతానికి అనువుగా ఉన్న రకాలతో పాటు.. వివిధ రకాల తెగుళ్లను, వ్యాధులను తట్టుకోగలిగే సౌత్ గుడి రకం చీనిని రైతులకు అందజేస్తున్నారు.
అదే విధంగా నిమ్మలో బాలాజీ, వకుల లాంటి అధిక దిగుబడినిచ్చి ఎక్కువ కాలం నిలువ ఉండే రకాలను కూడా కనుగొన్నారు. ఈ పరిశోధన కేంద్రం నుండి ప్రతి ఏటా సుమారు 75వేల నుంచి లక్షల మొక్కల వరకు రైతులకు ఇస్తున్నామని.. ఇప్పటి వరకు దాదాపు 13 లక్షల మందికి పైగా రైతులకు ఈ మొక్కలు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు వైరస్ తెగులుతో చీని పంట కుదేలవుతున్న తరుణంలో.. ఆ తెగులుకు కారణాన్ని ఇక్కడి శాస్త్రవేత్తలు కనుకున్నారు. ముఖ్యంగా వేరుకుళ్ళు ,శంకు తెగులకు కారణం నాణ్యమైన మొక్కలు రైతులకు అందక పోవడమేనని గమనించారు. ఇందులో భాగంగా రెండు కోట్ల రూపాయల ఖర్చుతో స్క్రీన్ హౌస్ ఏర్పాటుచేసి ఆందులో నాణ్యమైన చీనీ మొక్కలను పెంచుతున్నారు.
వాటి నుంచి తీసిన కణజాలంతో మొక్కలకు అంటుకట్టి రైతులకు ఇస్తున్నారు. ఈ మొక్కలను 2016 నుంచి ఇస్తున్నట్లు సీనియర్ సైంటిస్ట్ పరిశోధన స్థానం ఇంచార్జ్ తెలిపారు. ఇక ఈ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు ఎక్కువగా రైతు కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. వారంతా రైతులతో ఆప్యాయంగా ఉంటూ, వారి పొలాలకు వెళ్ళి.. చీనీ నిమ్మ రకాల నాణ్యత, మార్కెటింగ్ విషయాల్లో సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
మరోవైపు చీనీ నిమ్మ పరిశోధన స్థానానికి అనుబంధంగా నెల్లూరు జిల్లాలోని పెట్లూరు. నంద్యాల జిల్లాలోని మహానంది వద్ద పరిశోధన స్థానాలు ఉన్నాయి. పెట్లూరులో నిమ్మ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల నంద్యాలలో చీనీ మొక్కలు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ సైంటిస్ట్, శాస్త్రవేత్తలు తెలిపారు.
ముఖ్యంగా రైతులు క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడడాన్ని తగ్గించి.. సేంద్రీయ పద్ధతిలో కలుపు మందులు వాడే విధంగా ప్రోత్సాహిస్తున్నామని.. రైతులకు ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా తమ పరిశోధన స్థానం పనిచేస్తుందని ఇక్కడి సైంటిస్టులు పేర్కొంటున్నారు..












