నాటి రాతియుగం నుండి నేటి కంప్యూటర్ కాలం వరకు మానవుని మనుగడలో, ఆలోచనలో ఎన్నో మార్పులు జరిగాయి. ఊహకందని స్థాయిలో అభివృద్ధి చెందుతున్న మనిషి, కొన్ని నమ్మకాలను మాత్రం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాడు. ఇలాంటి వాటిని మూఢనమ్మకాలు అని కొట్టిపారేయడానికి వీలు లేదు.
ఎందుకంటే సైన్స్ కు కూడా అందని ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద రహస్యాలుగా మిగిలిపోయి అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుండటం మనకు తెలిసిందే. అలాంటి వాటిలో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చూడబోయే ఆలయం ఒకటి.
కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మితమైన ఈ దేవస్దానంలో ప్రతి ఏటా డిసెంబర్ లో ఏడు వారాల పాటు ఘనంగా ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడున్న దేవుడికి మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుస్తాడని భక్తులకి అపారమైన నమ్మకం. ఇంతకి ఈ దేవస్దాన ప్రత్యేకత ఏంటి..ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కానీ వాటిలో ఉన్న కొన్ని ఆలయాలకు మాత్రం పేర్లు చిత్రంగా ఉంటాయి. అందులో తెలంగాణలో కూడా చిత్రమైన పేరుతో పిలవబడే ఆలయం ఉంది. అదే జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు పదికిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ మల్లన్న స్వామి గుడి..
ఈ ఆలయానికి ఈ పేరు రావడానికి ప్రత్యేక చరిత్ర ఉందట. కాగా దొంగమల్లన్న దేవస్థానం 11 వ శతాబ్దపు చివరి భాగంలో పొలాస పాలకులు నిర్మించారనే నానుడి ఉంది. గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారట. ఈ స్వామివారిని దర్శించుకుంటే సకల భాదలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం..
ఇక ప్రతి ఏట డిసెంబర్ వచ్చిందంటే ఊరంతా రోజు పండగే... ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తులతో గ్రామం జాతరగా మారుతుంటుంది. మార్గశిర మాస శుధ్ద పంచమి తర్వాత వచ్చే షట్టి మొదలుకొని ఏడూ వారాల పాటు తెలంగాణా వ్యాప్తంగా ఘనంగా జరిగే పండుగలో మల్లన్న బోనాల జాతర ఒకటి. ఇక ప్రతి ఆదివారం, బుధవారం రోజున అయితే ఊరంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది.
ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుద్ధ పంచమి నాడు మల్లికార్జున స్వామి కళ్యాణం, దండి వారం, నాగవల్లి తో ఈ జాతర మహావైభవంగా ప్రారంభమవుతుంది. ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారి మొక్కలు చెల్లించుకుంటారు.
కోరిన కోరికలు తీరిన భక్తులు.. తమ ఎత్తు బెల్లం పంచిపెట్టడం , తలనీలాలు ఇవ్వడం, బియ్యం సమర్పించడం వంటివే కాకుండా గుండ చిలుకలో నూనె పోయడం, ఆలయ మండపంలో గంటలు కూడా కడతారు. స్వామివారికి పట్నాలు వేసి బెల్లంతో వండిన బోనాలు తీస్తారు. ప్రసాదం సమర్పించిన తర్వాత భక్తులు బోనాలు స్వీకరిస్తారు. గొల్లకురుమల డప్పు వాయిద్యాలు, శివసత్తుల పునకాలతో ఏడువారాల పాటు ఆలయ ప్రాంగణం అంతా మార్మోతుంటుంది.
మరోవైపు ఈ ఆలయ నిర్మాణానికి ఓ ప్రత్యేక కధనం ప్రచారంలో ఉంది. 11 వ శతాబ్దపు రాజులైన పొలస పాలకులకు రాజ్యం ఏలుచున్న సమయంలో వీరికి చెందిన కొన్ని ఆవులు దొంగిలించబడ్డాయి. అలా అపహరించిన ఆవుల్ని దారిలో ఒకరు చూసి ఇవి రాజు కు చెందిన ఆవులుగా గుర్తిస్తాడు. తాము దొరికిపోతాము అనే భయంతో దొంగలు మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి ఆవుల రంగులను మార్చి గుర్తు పట్టకుండా చేస్తే స్వామివారికి గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట.
స్వామి వారు అనుగ్రహించడంతో వారి కోరికలు తీర్చారని ఫలితంగా స్వామివారికి ఆ దొంగలు రాత్రికి రాత్రే గుడి కట్టారని అర్చకులు చెప్తున్నారు..దీంతో ఈ దేవస్దానం దొంగమల్లన్న ఆలయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ప్రసిద్దికెక్కింది.












